Begin typing your search above and press return to search.

అచ్చెన్న ఆరోగ్య సమస్య ఏమిటి? ఇప్పుడాయనకు ఎలా ఉంది?

By:  Tupaki Desk   |   16 Jun 2020 4:15 AM GMT
అచ్చెన్న ఆరోగ్య సమస్య ఏమిటి? ఇప్పుడాయనకు ఎలా ఉంది?
X
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకొని అరెస్టు చేయటం.. అనంతరం ఆయనకు రిమాండ్ విధించటం తెలిసిందే. అయితే.. అచ్చెన్నకు ఆరోగ్యం బాగోలేదని.. అరెస్టుకు ముందు రోజే ఆయనకు సర్జరీ జరిగినట్లుగా చెబుతున్నారు. ఉదయం మొదలుకొని రాత్రి వరకూ వాహనంలో తిప్పటంతో ఆయన అనారోగ్యానికి గురైనట్లుగా వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

అరెస్టుకు ముందు రోజు అచ్చెన్నకు పైల్స్ ఆపరేషన్ జరిగింది. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి సర్జరీ జరిగినప్పుడు చెప్పుకోలేని బాధ ఉంటుంది. ఎంతో అసౌకర్యంగానూ ఉంటుంది. అలాంటివేళ.. గంటల కొద్దీ సమయం వాహనంలో కూర్చోవాల్సి రావటం.. రోడ్డు మార్గాన శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకూ ప్రయాణించటం అంటే మాటలు కాదు. మామూలు పరిస్థితుల్లోనే కాళ్లు పీకటం లాంటివి ఉంటాయి. అలాంటిది సర్జరీ చేసిన పక్కరోజే అంటే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది.

ఉదయం నుంచి పక్కరోజుల తెల్లవారుజాము వరకుకూర్చుని.. నిలుచోవాల్సిన పరిస్థితి రావటంతోఆయనకు గాయం పెద్దదైందని.. రక్తస్రావం జరిగినట్లుగా చెబుతున్నారు. ఫైల్స్ ఆపరేషన్ వల్ల కలిగిన పుండు నుంచి కారుతున్న రక్తం ఎంతకూ ఆగటం లేదంటున్నారు. దీనికి తోడు బీపీ.. షుగర్ లాంటివి ఉండటంతో సమస్య తీవ్రత మరింత పెరిగినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అరెస్టు తర్వాత ఆయనకు మరోసారి సర్జరీ చేసినట్లు చెబుతున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలుబయటకు వెల్లడించకున్నా.. కోర్టుకు మాత్రం నివేదిక ఇస్తున్నట్లు చెబుతున్నారు. కారణం ఏమైనా కావొచ్చు.. ఒక రాజకీయ నేతను అరెస్టుచేసే సమయంలో ఆయన ఆరోగ్య సమస్యల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న అచ్చెన్నను బెయిల్ మీద విడుదల చేయాలని కోరుతున్నారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అచ్చెన్న విడుదల న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.