Begin typing your search above and press return to search.

ఈఎస్ ఐ 'రాణి'... వంద కోట్లు పోగేశారట!

By:  Tupaki Desk   |   5 Dec 2019 4:58 PM GMT
ఈఎస్ ఐ రాణి... వంద కోట్లు పోగేశారట!
X
తెలుగు నేలలో సంచలనం రేకెత్తించిన ఈఎస్ఐ స్కాంలో కీలక నిందితురాలిగా ఉన్న దేవికారాణి ఆస్తుల చిట్టా నిజంగానే షాక్ కు గురి చేస్తోంది. ఈఎస్ఐ ఆసుపత్రులకు మందుల కొనుగోళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన దేవికారాణి... ఎట్టకేలకు తెలంగాణ ఏసీబీ రంగంలోకి దిగిపోవడంతో అడ్డంగా దొరికిపోయారు. అక్రమాలకు పాల్పడ్డట్టుగా పక్కా ఎవిడెన్స్ దొరికిన నేపథ్యంలో రాణి... ఏమాత్రం బెట్టు చేయకుండానే జైలుకెళ్లిపోయారు. అయితే దేవికారాణి పాల్పడిన అక్రమాల చిట్టా చూస్తుంటే మాత్రం... అవినీతి అక్రమాల్లో ఈమెను నిజంగానే ‘రాణి’గా చెప్పుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వందల కోట్ల మేర అక్రమాలు జరిగాయని భావిస్తున్న ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న దేవికారాణి కూడబెట్టినదెంత? అన్న దిశగా కాస్తంత లోతుగానే విచారణ చేసిన ఏసీబీ అధికారులు.. ఆ చిట్టా చూసి షాక్ తిన్నారట. దేవికారాణి ఈ అక్రమ దందాతో ఏకంగా వంద కోట్లకు పైగానే పోగేసినట్లు ఏసీబీ తేల్చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వంద కోట్లకు పైగా పోగేసిన రాణికి ఆమె భర్త, రిటైర్డ్ సివిల్ సర్జన్ గురుమూర్తి కూడా పూర్తిగానే సహాయ సహకారాలు అందజేశారట. భర్త సహకారంతో దేవికారాణి ఏకంగా వంద కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారట.

దేవికారాణి పోగేసిన ఆస్తుల చిట్టా చూస్తే... తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ లోనూ భారీగా స్థిరాస్తులున్నాయట. నారాయణగూడలోని ఇండియన్ బ్యాంక్ లో 34 లక్షల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు, మరో 23 బ్యాంకుల్లో రూ.1.23 కోట్ల బ్యాలెన్స్ - ఇంట్లో రూ.25.72 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు - రూ.8. 40 లక్షల నగదు - రూ.7 లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు - రూ.20 లక్షల విలువైన ఇన్నోవా కారు - వేర్వేరు చోట్ల మరో రూ.15 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించిందట. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో 100 కోట్లపైగానే ఉంటుందని ఏసీబీ వర్గాలే అంటున్నాయి.