Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడుకు ఏసీబీ షాక్‌: ‌మ‌రోసారి నో బెయిల్

By:  Tupaki Desk   |   3 July 2020 2:50 PM GMT
అచ్చెన్నాయుడుకు ఏసీబీ షాక్‌: ‌మ‌రోసారి నో బెయిల్
X
ఈఎస్‌ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్‌తో ప్రమేయం ఉన్నార‌నే ఆరోప‌ణ‌తో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కింజారపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఇప్ప‌టికే విచార‌ణ కొన‌సాగుతోంది. అత‌డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారిస్తోంది. తాజాగా ఏసీబీ కోర్టు అత‌డికి షాకిచ్చింది. అత‌డు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం కొట్టేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వలేమని చెప్పింది.

ఈఎస్‌ఐ మందుల కుంభకోణం కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ అవినీతిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసేలా ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడితో పాటు మరో 18 మంది ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన ఏసీబీ అచ్చెనాయుడుతో సహా 9 మందిని అరెస్ట్‌ చేసింది.

తాజాగా అచ్చెన్నాయుడు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు. అయితే డిశ్చార్జ్ విష‌యం కూడా రాద్ధాంత‌మైంది. ఆరోగ్య కుదుటపడనప్పటికీ అచ్చెన్నను అక్రమంగా డిశ్చార్జి చేశారని టీడీపీ వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆయన డిశ్చార్జిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం ఖండించారు. అత‌డిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. త‌నకు మ‌హ‌మ్మారి వైర‌స్ పరీక్షలు నిర్వహించాలని అచ్చెన కోరారు. దీనిపై ఇంకా స్పంద‌న రాలేదు.