Begin typing your search above and press return to search.

ఏసీబీ పనికిరాని విభాగమా?

By:  Tupaki Desk   |   1 Jan 2016 5:30 PM GMT
ఏసీబీ పనికిరాని విభాగమా?
X
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆ మాటకొస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉంది. ఇది అవినీతిపరులను పట్టుకుంటుంది. వాళ్లపై దాడి చేస్తుంది. వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. గత ఆరు దశాబ్దాలుగా అవినీతి నిరోధక శాఖ ఇంత నిక్కచ్చిగా పని చేస్తున్నా.. రాష్ట్రంలో, దేశంలో అవినీతి ఎందుకు తగ్గలేదు.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లోని తాజా ఘటననే తీసుకుందాం. ఆనంద్ కుమార్ అనే సబ్ రిజిస్ట్రార్. అతగాడి ఇల్లు మిరుమిట్లు గొలిపే ఇంద్ర భవనమే. నాలుగు అంతస్తుల డూప్లెక్స్ లో బయో మెట్రిక్ లిఫ్టు. మినీ థియేటర్, బార్ తదితరాలన్నీ ఉన్నాయి. అతగాడి ఆస్తులు కొన్ని వందల కోట్లు అని ఏసీబీ ఘనంగా ప్రకటించింది. ఏసీబీ ఇలా అవినీతి తిమింగలాలను పట్టుకోవడం, ఘనంగా ప్రకటించుకోవడం కొత్తేమీ కాదు.

గతంలోనూ అవినీతి తిమింగలాలను పట్టుకుంది. వాళ్లు ఎన్ని వందల కోట్లు సంపాదించారో లెక్కలు మరీ చెప్పింది ఆ వివరాలన్నీ ప్రచార, ప్రసార సాధనాల్లో వచ్చాయి కూడా. మరి, ఇప్పుడు వాళ్లంతా ఏం చేస్తున్నారు? అవినీతి తిమింగలాల ఉద్యోగాలను ప్రభుత్వం తీసేసిందా? వాళ్లు జైలు ఊచలు లెక్కబెడుతున్నారా? అవినీతిపరులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు, కాదు అనే. ఎందుకంటే, అవినీతిపరులను ఏసీబీ పట్టుకుంటుంది. వారిపై కేసులు నమోదు చేస్తుంది. ఆ కేసును కోర్టుకు అప్పగించేసి మరొక కేసు దర్యాప్తులో పడిపోతుంది. ఏసీబీ పని అవినీతిపరులను పట్టుకుని వారిని కోర్టుకు అప్పగించడమే. కానీ, ఆ తర్వాతే కేసులన్నీ వీగిపోతున్నాయి. కోర్టుల్లో నుంచి అవినీతిపరులు నిర్దోషులుగా బయటపడి బయటకు వచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు వారికి సహకరిస్తున్నారు. అందుకే ఇంతమంది అవినీతిపరులు పట్టుబడుతున్నా ఎక్కడా అవినీతి తగ్గడం లేదు. ఏసీబీ కోర్టులు, రాజకీయ నాయకులు కలిసి ఏసీబీని ఒక పనికిమాలిన విభాగంగా మార్చేశారన్న విమర్శలూ ఉన్నాయి. ఏసీబీతోపాటు దాని అనుబంధ విభాగాలను కూడా పటిష్ఠం చేసి అవినీతిపరులకు శిక్ష పడేలా చేస్తేనే అవినీతి కొంతైనా తగ్గుతుంది కానీ.. వాటికి కొమ్ము కాస్తే ఇవన్నీ ఉత్తుత్తి దాడులేనని ఉద్యోగులు తీసిపారేస్తారు.