Begin typing your search above and press return to search.

డొంకతిరుగుడు ప్రశ్నలు.. తప్పించుకునేలా సమాధానాలు

By:  Tupaki Desk   |   9 Jun 2015 4:25 AM GMT
డొంకతిరుగుడు ప్రశ్నలు.. తప్పించుకునేలా సమాధానాలు
X
ఓటుకు నోటు వ్యవహారంలో కోర్టు ఇచ్చిన కస్టడీ సమయం ముగిసిపోతున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నుంచి ''అసలు విషయాన్ని'' రాబట్టే ప్రక్రియను ఏసీబీ ముమ్మరం చేసింది. విచారణలో భాగంగా.. మరింత సమాచారాన్ని రేవంత్‌ నోటి నుంచి చెప్పించి.. మరింత ఉచ్చు బిగించాలన్న ఏసీబీ అధికారుల ప్రయత్నం సఫలం కాలేదన్న వాదన వినిపిస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం.. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని దాదాపుగా ఆరుగంటలకు పైనే విచారించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా డొంకతిరుగుడు ప్రశ్నలు చాలానే వేసినట్లు సమాచారం. ఒకదానికి ఒకటి సంబంధం లేనట్లుగా కనిపించే ప్రశ్నలతో.. అసలు విషయాన్ని లాగే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు.

మూడో రోజు విచారణ మొత్తం ''బాస్‌'' చుట్టూనే తిరిగినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సందర్భంగా బాస్‌తో మాట్లాడతా.. బాస్‌తో చెబుతా లాంటి మాటలు చాలా సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో అసలు బాస్‌ ఎవరు? అన్న అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా చంద్రబాబునాయుడ్ని మీరు ఏమని పిలుస్తుంటారు? చంద్రబాబు నాయుడి ఫోన్‌ నెంబరును మీరు ఏ పేరు మీద మీ సెల్‌ఫోన్‌లో నమోదు చేసుకుంటారు? లాంటి ప్రశ్నలతో పాటు.. బాస్‌ అని ఎవరిని పిలుస్తారని ప్రశ్నించటంతో పాటు పలు డొంకతిరుగుడు ప్రశ్నలు సంధించారని చెబుతున్నారు.

అధికారులు వేసిన ప్రశ్నలకు రేవంత్‌ సమాధానాలు ఆచితూచి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన చెప్పిన సమాధానాలేవీ ఏసీబీ విచారణ అధికారులకు సంతృప్తికరంగా లేవని సమాచారం. మూడు రోజులు ప్రశ్నించిన ఫిక్స్‌ చేసే సమాచారం లేకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోన్నట్లు సమాచారం.

చంద్రబాబునాయుడ్ని తాను సార్‌ అని సంబోధిస్తానని చెప్పినట్లు చెబుతున్నారు. మరి.. బాస్‌ అని ఎవరిని పిలుస్తారంటే.. ఎవరినైనా పిలవొచ్చు కదా.. సరదాగా మాట్లాడుతున్నప్పుడు స్నేహితుల్ని కూడా బాస్‌ అనే పిలుస్తుంటాం కదా అని జవావిచ్చినట్లు తెలిసింది. చంద్రబాబును ఏ పేరు మీద మొబైల్‌లో ఫీడ్‌ చేసుకుంటారని ప్రశ్నింగా.. ''ఫోన్‌ మీదగ్గరే ఉంది కదా.. చూసుకోవచ్చుగా'' అని బదులిచ్చినట్లు తెలుస్తోంది.

మూడో రోజు విచారణ చూస్తే.. మొత్తం సంధించిన ప్రశ్నలలో ఎక్కువ భాగం బాస్‌ చుట్టూ.. డబ్బు ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్న అంశంపైనే తిరిగినట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రేవంత్‌రెడ్డిని కస్టడీలో తీసుకొని అధికారులు ప్రశ్నిస్తున్న తీరు.. దానికి రేవంత్‌ స్పందిస్తున్న విధానం చూస్తుంటే.. దాగుడుమూతలు ఆడుకున్నట్లుగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది.