Begin typing your search above and press return to search.

ఫంక్షన్‌లో రేవంత్‌పై ఏసీబీ ప్రత్యేక నిఘా!

By:  Tupaki Desk   |   11 Jun 2015 6:35 AM GMT
ఫంక్షన్‌లో రేవంత్‌పై ఏసీబీ ప్రత్యేక నిఘా!
X
ఓటుకు నోటు వ్యవహారంలో జైలు పాలై, కుమార్తె నిశ్చితార్థం కోసం 12 గంటల బెయిల్‌ను పొందిన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి అనుచరుల నుంచి ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయం ఆరుగంటలకు జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకొన్న రేవంత్‌కు అనుచరులు భారీ స్థాయి ఏర్పాట్లతో స్వాగతం పలికారు. అటు రేవంత్‌ కుమార్తె నిశ్చితార్థం ఉత్సాహం, ఇటు రేవంత్‌ విడుదల ఉత్సాహం వారిలో కనిపించింది. తెల్లవారుజాముకే చాలా మంది అభిమానులు రేవంత్‌ ఇంటికి చేరుకొన్నారు. రేవంత్‌ వచ్చే సమయానికి వారు పూలతో ఆయనకు స్వాగతం పలికారు.

ఈ నిశ్చితార్థ కార్యక్రమం కోసం రేవంత్‌కు సాయంత్రం వరకూ బెయిల్‌ లభించింది. ఆయన సాయంత్రం ఆరుగంటలకు తిరిగి లొంగిపోవాల్సి ఉంటుంది. మానవతాదృక్పథంతో కూతురి నిశ్చితార్ధానికి రేవంత్‌కు బెయిల్‌ను ఇచ్చింది న్యాయస్థానం. అయితే అది కేవలం 12 గంటల సేపటికి మాత్రమే.

ఇక ఈ సమయంలో రేవంత్‌ మీడియాతో కానీ.. పార్టీ నేతలతో కానీ 'ఓటుకు నోటు' వ్యవహారం గురించి ఎలాంటి సమచారాన్ని పంచుకోకూడదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఏసీబీ అధికారులు కూడా రేవంత్‌పై డేగ కన్ను వేశారు.

నిశ్చితార్థం సందర్భంగా వారు ఈ కార్యక్రమంలోనే ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి ఆయనతో ఎవరెవరు మాట్లాడుతున్నారు.. అనే అంశం గురించి పరిశోధిస్తున్నారు. రేవంత్‌ అయితే ఇప్పటి వరకూ దూకుడుగానే కనిపిస్తున్నాడు. రెండోసారి కూడా మీడియా కనిపించే సరికి మీసం దువ్వాడాయన. ఈ కేసు నుంచి తను బయటపడగలనన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. మరి కూతురి నిశ్చితార్థంలో ఆయన ఎలా వ్యవహరిస్తాడో.. కోర్టు ఆదేశాలను ఏ మేరకు పాటిస్తాడో.. ఈ పన్నెండు గంటల్లో ఏసీబీ దృష్టిలోకి ఏయే అంశాలు వస్తాయో వేచి చూడాలి!