Begin typing your search above and press return to search.

ఏసీబీ అధికారుల‌పైనే కుక్క‌ను వ‌దిలాడుగా

By:  Tupaki Desk   |   18 Nov 2017 10:44 AM GMT
ఏసీబీ అధికారుల‌పైనే కుక్క‌ను వ‌దిలాడుగా
X

రాష్ట్రంలో అవినీతి అధికారుల భ‌ర‌తం ప‌డుతున్న ఏసీబీ అధికారుల‌కు అనూహ్య ప‌రిణామం ఎదురైంది. ఇటీవ‌ల ఆ జిల్లా, ఈ జిల్లా అనికాకుండా ఆ డిపార్ట్‌మెంట్‌, ఈ డిపార్ట్‌ మెంట్ అని లేకుండా అవినీతి ఎక్క‌డ ఉంటే అక్కడ ఏసీబీ రెచ్చిపోతోంది. అవినీతితో అంట‌కాగి.. కోట్లు గ‌డిచింన అధికారుల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంది. ఈ క్ర‌మంలోనే అనేక మంది అధికారుల అవినీతి బాగోతాలు వెలుగు చూశాయి. ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. అయితే,ఈ క్ర‌మంలోనే త‌మ విధుల‌ను నిర్వ‌హించేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారుల‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది.

అధికారంలో ఉండ‌గా ప్ర‌జ‌ల‌ను పీడించి మ‌రీ అక్రమ ఆస్తులు వెనకేసున్నారనే సమచారంతో ఏసీబీ అధికారులు... ఓ మాజీ అధికారి ఇంటిపై దాడులు చేయ‌డానికి వ‌చ్చారు. అయితే ఆ దాడులను అడ్డుకునేందుకు స‌ద‌రు మాజీ అధికారి ఏకంగా తన పెంపుడు కుక్కను ఏసీబీ అధికారులపై వదిలాడు. దీంతో ర‌య్య‌న‌ ఏసీబీ అధికారులపైకి దూసుకు వ‌చ్చిన కుక్క‌.. అమాంతం వారిపై దాడికి తెగ‌బ‌డింది. ఈ హ‌ఠాత్ ప‌రిణామంతో ఏసీబీ అధికారులు భీతిల్లి పోయారు. అక్కడ నుంచి పరుగులు తీశారు. అనంతరం స్థానిక పోలీసుల సాయంతో మాజీ అధికారి ఇంటి తలుపులు పగులగొట్టి సోదాలు చేపట్టారు.

విజయనగరం జిల్లాలో రెవెన్యూ డిపార్ట్‌ మెంట్‌ లోని సర్వే విభాగంలో సర్వేయర్‌ గా పని చేసిన గేదెల లక్ష్మీ గణేశ్వరరావు నివాసంపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించడానికి ముందు గణేశ్వరరావు ఏసీబీ అధికారులపై పెంపుడు కుక్కను ఉసికొల్పాడు. దీంతో అధికారులు పరుగు లంకించుకున్నారు. అనంతరం ఆయనగారు మాత్రం ఇంటికి తాళం వేసుకుని దర్జాగా లోపల కూర్చున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.

ఇక‌, గ‌ణేశ్వ‌ర‌రావు ఇంటితో పాటు మొత్తం ఆయ‌న‌కు సంబంధించిన 17 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌ - విశాఖ పట్నం - విజయనగరం - తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. కాగా లక్ష్మీ గణేశ్వరరావుపై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. అయితే, ఏసీబీ అధికారుల‌పై కుక్క‌ను ఉసిగొల్ప‌డాన్ని ఉన్న‌తాధికారులు మ‌రింత తీవ్రంగా భావిస్తున్నారు. దీనిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా కేసులు న‌మోదు చేయాల‌ని భావిస్తున్నారు.