Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి ప‌రువు అడ్డంగా తీశారు

By:  Tupaki Desk   |   26 Nov 2016 5:40 AM GMT
అమ‌రావ‌తి ప‌రువు అడ్డంగా తీశారు
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కదిలిస్తే చాలు.. ఆయన నోటి నుంచి సూక్తిముక్తావళి చాలానే వినిపిస్తోంది. అవినీతిపై యుద్ధం చేస్తున్న వ్యక్తిగా ఆయన తరచూ చెప్పుకుంటుంటారు. అదే సమయంలో పార్టీ నేతలపై వచ్చే అవినీతి ఆరోపణలపై పెద్దగా స్పందించినట్లుగా కనిపించరు. గడిచిన రెండున్నరేళ్లలో పలువురు టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా.. చంద్రబాబు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ ఉంది.

అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటం.. అలాంటి వారికి చెక్ చెప్పటం ద్వారా అవినీతిని తాను సహించేది లేదన్న సంకేతాలు ఇచ్చి ఉంటే బాగుండేది. పదేళ్లు విపక్షంలో ఉండి.. అధికారాన్ని చేపట్టిన నేపథ్యంలో కొన్ని అంశాల విషయంలో చూసీచూడనట్లుగా ఉండాలన్న ఆయన ఆలోచన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందన్న విమర్శ ఉంది. దీనికి తగ్గట్లే గడిచిన కొద్ది నెలలుగా అవినీతి ఏపీ సర్కారులో భారీ ఎత్తున చోటు చేసుకుంటుందన్న ఆరోపణ ఉంది.

దీనిపై విమర్శలు వచ్చినా.. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇలాంటి ఉదంతాలు బయటకు రాని పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా ఏపీ సచివాలయంలోనే లంచావతారాలు ఎంతగా చెలరేగిపోతున్నాయో తెలియజేసే ఉదంతం బయటకు వచ్చింది. హైదరాబాద్ నుంచి వెలగపూడికి ఏపీ సచివాలయాన్ని మార్చిన తర్వాత తొలిసారి ఏసీబీ దాడి జరగటం సంచలనంగా మారింది. హోంశాఖలో ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో హోంశాఖ సెక్షన్ ఆఫీసర్ కొత్తవరపు శ్రీనాథ్ దొరికిపోయారు.

గుజరాత్ కు చెందిన సంతన్ గంగూలీ హైదరాబాద్ కేంద్రంగా శివ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ పేరిట ఒక సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. బ్యాంకులు.. ప్రైవేటు సంస్థలకు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేస్తుంటారు. విభజన నేపథ్యంలో తమ సంస్థ కార్యకలాపాల్ని ఏపీలోనూ నిర్వహించేందుకు వీలుగా అధికారిక అనుమతులు అవసరమయ్యాయి. దీనికి సంబంధించి హోంశాఖ లైసెన్స్ ను ఇచ్చేందుకు రూ.50వేలు లంచం అడగటం.. ఈ సమాచారాన్ని ఏసీబీకి ముందస్తుగా తెలియజేశారు. వ్యూహాత్మకంగా పాత రూ.500 నోట్లను ఉద్యోగికి ఇచ్చే క్రమంలో అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి అవినీతిపై యుద్దం చేస్తానని చెబుతున్న వేళ.. మరోవైపు ఆయన సర్కారు పరిపాలనా కేంద్రంలోనే అవినీతి ఉదంతం చోటు చేసుకొని ఏసీబీకి అడ్డంగా దొరికిపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సచివాలయంలోనే అవినీతి ఈ స్థాయిలో ఉన్నా.. చంద్రబాబు ఈ అంశాన్నిసీరియస్ గా తీసుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బాబు కరకుగా ఉండని పక్షంలో ఆయన సర్కారుకు మరింత చెడ్డపేరు రావటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది.