Begin typing your search above and press return to search.

ఏసీబీ దాడులు జ‌రిపే లిస్ట్ బ‌య‌ట‌కొచ్చింది

By:  Tupaki Desk   |   10 Jan 2016 10:29 AM GMT
ఏసీబీ దాడులు జ‌రిపే లిస్ట్ బ‌య‌ట‌కొచ్చింది
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో అవినీతి ఉద్యోగులు - అధికారుల భరతం పట్టేందుకు నిర్దేశించిన‌ అవినీతి నిరోధక శాఖ త‌న కార్యాచ‌ర‌ణ‌లో సిద్ధమవుతోంది. భారీ అవినీతి తిమింగలాలపై వల వేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే కీలక వివరాలను తెప్పించుకుంటోంది. ఈ క్ర‌మంలో ఏయే శాఖ‌ల్లో అవినీతి ఎక్కువ‌గా ఉందో ఇప్ప‌టికే దృష్టి సారించింది.

ఏపీలోని అన్ని శాఖల నుంచి తెప్పించుకుంటున్న అవినీతి ఉద్యోగుల రహస్య సమాచారాన్ని తమ సొంత సిబ్బందికి కూడా తెలియనివ్వకుండా ఏసీబీ ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనేక సందర్భాల్లో దాడులకు సంబంధించిన సమాచారాన్ని ఆ శాఖలోని కొంతమంది ఉద్యోగులే నిందితులకు చేరవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే వివరాలను దిగువ స్థాయి అధికారులకు కూడా చివరి క్షణం వరకు తెలియనీయడం లేదు. ఖజానాకు ఎక్కువ ఆదాయం సమకూర్చే స్టాంపులు-రిజిస్ట్రేషన్లు - ఎక్సయిజ్‌ - రవాణా వంటి శాఖలతోపాటు సర్కారు నిధులను ఖర్చుచేసే విద్య - వైద్య - సంక్షేమ శాఖలు- ప్రజలకు కీలక సేవలు అందించాల్సిన రెవెన్యూ శాఖలపైనే అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్ర దర్యాప్తు, చర్యల సంస్థల్లో అత్యంత కీలకమైన విజిలెన్స్‌ కమిషన్‌ వద్ద పేరుకుపోతున్న అవినీతిపరుల కేసుల్లో ఈ శాఖలవే సింహభాగంగా ఉన్నాయి.

గ‌త అనుభ‌వాల‌ నేప‌థ్యంలో రెవెన్యూ - మున్సిపల్‌ - వైద్య ఆరోగ్య శాఖల్లోని వారిపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఆయా శాఖల్లో నిబద్ధతతో పనిచేసే అధికారుల నుంచి రహస్యంగా అవినీతి ఉద్యోగుల పేర్లు తెప్పించుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వందమందికి పైగా వివిధ స్థాయిలోని అధికారులు - ఉద్యోగుల జాబితాను ఏసీబీ ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఈ జాబితాకు పేర్లు ఎక్కినట్లు సమాచారం. ఒక వ్యూహం ప్రకారం ఈ దాడులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్న‌ల్‌ లభించాల్సిఉంది. ఇప్పటికే తమ వ్యూహానికి సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ అధికారులు మంత్రులతో పాటు, ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పంపినట్లు సమాచారం. అయితే తుది చర్యలను ఖరారు చేయడంలో రాజకీయ నిర్ణయం కీలకంగా మారనుంది.

మొత్తంగా అక్ర‌మార్కుల ఆస్తులు - అక్రమాలపై వివరాలు సేకరించి పెట్టుకొని కొంతకాలం వేచి చూసి అకస్మాత్తుగా దాడి చేయ‌డం లేదా ప్ర‌స్తుత‌మే రంగంలోకి దిగ‌డం అనే ద్విముఖ వ్యూహంతో ఏపీ ఏసీబీ వేగంగా అడుగులు వేస్తోంది.