Begin typing your search above and press return to search.

చిన్నసారు వారి సంపాదన బెడ్ నిండా సరిపోయిందిగా?

By:  Tupaki Desk   |   17 April 2021 5:30 AM GMT
చిన్నసారు వారి సంపాదన బెడ్ నిండా సరిపోయిందిగా?
X
సంపద. ఇదంతా.. ఇంట్లో వెతికితే దొరికిన సంపద. రూపాయిల్లో చెప్పాలంటే.. ఒక్క క్యాష్ లెక్కేస్తేనే రూ.35 లక్షలు. ఇవి కాకుండా బంగారం.. వెండి.. భూముల పేపర్లు.. మూడు జిల్లాల్లో ఫ్లాట్లు.. ఈ మొత్తం లెక్కేస్తే.. కోటి అంకెను ఇట్టే దాటేస్తుంది. ఇంతా చేస్తే..ఈ అక్రమ ఆదాయానికి యజమాని ఏం చేస్తారో తెలిస్తే.. అవాక్కు అయిపోతారు. నోట మాట రానట్లు ఉండిపోతారు. నిజం.. ఎందుకంటే.. ఇంతటి అక్రమ సంపాదన ఏ పెద్ద అధికారిదో కాదు.. ఏపీలోని ఒక వెనుకబడిన జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి కార్యదర్శిగా పని చేసే చిరుద్యోగిది.

షాకింగ్ గా ఉండే ఈ ఉదంతంలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం గ్రామ పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్నారు వెంకటరావు. చేసేది చిరుద్యోగమే అయినా.. చిన్నసారుకు ముందు చూపు ఎక్కువ అన్నట్లు ఉంది. తన దగ్గరకు పని కోసం వచ్చే వారికి.. తన భవిష్యత్తుకు అవసరమైన లెక్కకు తగ్గట్లు.. భారీగా వసూళ్లకు పాల్పడటం ఇతగాడికున్న ఒక ఆర్ట్.

రణస్థలం మండలం ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ గా అదనపు విధులు నిర్వహిస్తున్న ఇతగాడి మీద అదే పనిగా కంప్లైంట్లు రావటంతో ఏసీబీ అధికారులు ఒక కన్నేసి ఉంచారు. పిల్లల చదువుల కోసం కుటుంబంతో కలిసి విశాఖలో ఉంటున్నాడు. ఇతగాడి పాపం పండి.. ఏసీబీ అధికారులు ఏకకాలం మూడుచోట్ల సోదాలు నిర్వహించారు. సొంతూరులో కొన్ని భూముల పత్రాలు మాత్రమే లభించాయి.

దీంతో.. తాము అంచనాకు భిన్నంగా పరిస్థితి ఉండటంతో తప్పుగా టార్గెట్ చేశామా? అన్న భావన ఒక దశలో అధికారుల్లో కలిగిందట. కాకుంటే.. తమ గురి తప్పలేదన్న విషయం విశాఖపట్నంలో అతనుండే ఇంటిని సోదా చేసిన సమయంలో బయపడింది. అక్కడింట్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటకు రావటంతో అధికారులు సైతం అవాక్కు అయ్యారట. చిన్నసారు వారి అక్రమ సంపాదన లెక్క ఇప్పటికి రూ.1.38కోట్లుగా తేల్చారు. అదుపులోకి తీసుకొన్న అధికారులు కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఇతగాడి సమీప బంధువు ఒకరు కేంద్రమంత్రి వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ చిన్నసారు వ్యవహారం పెద్ద మలుపు తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.