Begin typing your search above and press return to search.

బాస్‌ కోటరీని మొదట బుక్‌ చేయటమే లక్ష్యం

By:  Tupaki Desk   |   8 July 2015 11:30 AM GMT
బాస్‌ కోటరీని మొదట బుక్‌ చేయటమే లక్ష్యం
X
ఫస్ట్‌ఫేజ్‌ కంటే సెకండ్‌ ఫేజ్‌లో ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆవేశం.. అతృతకు మించి.. ఒక క్రమపద్ధతిలో కేసును డీల్‌ చేయాలని భావిస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రేవంత్‌రెడ్డి వీడియో బయటకు వచ్చిన సందర్భంలో.. ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ మాట్లాడుతూ.. తమ అధికారులు చాలా ప్రొఫెషనల్‌గా పని చేస్తున్నారని చెప్పుకొన్నారు.

అయితే.. ఆయన మాటల్లో వినిపించనంత ప్రొఫెషలిజం చేతల్లో లేదన్న విషయం తర్వాత అర్థమైంది. చివరకు సెక్షన్లు నమోదు చేయటంలోనూ తప్పులు దొర్లాయన్న విషయాన్ని కోర్టులో కానీ గ్రహించలేకపోయారు. దీంతో.. ఇప్పటివరకూ అనుసరించిన వైఖరికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. లక్ష్యం కొండకు మాత్రమే అన్నట్లుగా దూకుడుగా వ్యవహరించి డిఫెన్స్‌లో పడిన ఏసీబీ.. తాజాగా మాత్రం అడుగు అడుగు వేసుకుంటూ.. కొండను చేజిక్కించుకోవాలన్నట్లు కనిపిస్తోంది.

ఓటుకు నోటు వ్యవహారంలో ''బాస్‌'' అత్యంత కీలకం. అయితే.. మొదట్లో లభ్యమైన ఆధారాలతో బాస్‌ అంతు తేల్చటం కష్టమన్న విషయాన్ని టీ సర్కారుతో పాటు.. అధికారులకు అర్థమైంది. అందుకే.. రూటు మార్చి.. బాస్‌ ముందున్న వ్యవస్థల్ని విజయవంతంగా దెబ్బ తీసిన తర్వాత అంతిమంగా బాస్‌ విషయం చూడలన్నదే లక్ష్యంగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా.. ప్రస్తుతం మరికొందరు టీటీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజాగా సండ్రను విచారించిన అధికారులు కొన్ని కీలకమైన అంశాల్ని బయటకు తీయటంతో పాటు.. సండ్ర విచారణకు ముందే..కొన్ని కీలక ఆధారాలు చేజిక్కించుకొని.. ఆ విషయాన్ని సండ్ర ఛార్జిషీట్‌లో పేర్కొనటం తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. ఓటుకు నోటుకు సంబంధించి ఐదు నుంచి పది మంది వరకు తాజాగా నోటీసులు ఇచ్చే వీలుందని చెబుతున్నారు.