Begin typing your search above and press return to search.

సెక్షన్‌ మార్చి మరీ సండ్రకు నోటీసు ఇవ్వటమేల..?

By:  Tupaki Desk   |   5 July 2015 5:04 AM GMT
సెక్షన్‌ మార్చి మరీ సండ్రకు నోటీసు ఇవ్వటమేల..?
X
ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ తీరు చిత్ర విచిత్రంగా ఉంటోంది. టీటీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారణకు హాజరు కావాలంటూ ఆ మధ్యన నోటీసులు జారీ చేయటం తెలిసిందే.

విచారణకు హాజరు కాని సండ్ర.. తనకు అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని.. చెప్పి మూడో కంటికి కనిపించకుండా వెళ్లిపోవటం తెలిసిందే. తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి వివరాలు పేర్కొన్నట్లుగా కొందరు చెబుతుంటే.. అలాంటి సమాచారం ఏమీ ఇవ్వలేదన్నవాదన వినిపించింది. తాజాగా తన ఆరోగ్యం కుదుట పడిందని.. తనను ఎప్పుడు విచారణకు పిలిచినా రావటానికి సిద్ధమని పేర్కొనటం తెలిసిందే.

తాజాగా సండ్రకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల లోపు విచారణకు హాజరు కావాలని పేర్కొనటం విదితమే. అయితే.. ఇక్కడో ఒక కీలకమైన పాయింట్‌ ఉంది. మొదట నోటీసులు జారీ చేసినప్పుడు సెక్షన్‌ 160 కింద నోటీసులు ఇస్తే.. ఈసారి మాత్రం సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేసింది.

తాజా నోటీసులకు హాజరు అవుతానని చెప్పిన సండ్రకు.. ఈసారి మాత్రం సెక్షన్లు మార్చి మరీ నోటీసులు జారీ చేయటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సెక్షన్‌ ప్రకారం.. విచారణకు హాజరై.. సంతృప్తికరంగా లేని పక్షంలో అరెస్ట్‌ చేసే వీలు.. తాజా సెక్షన్‌ కల్పిస్తుందని చెబుతున్నారు.

మరి.. సండ్రను అరెస్ట్‌ చేసే ఉద్దేశ్యంతో నోటీసుల్లోని సెక్షన్‌ను మార్చారా? లేక.. రోటీన్‌గానే ఇలాంటి పని చేశారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ సండ్రను అరెస్ట్‌ చేసిన పక్షంలో.. ఇప్పుడు ఏవైతే సందేహాలు వ్యక్తమవుతున్నాయో.. అవన్నీ నిజమని తేలినట్లేనని చెబుతున్నారు. తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చే కన్నా.. సోమవారం వరకూ వెయిట్‌ చేస్తే మంచిదేమో..!