Begin typing your search above and press return to search.

డ్రైవర్లు అయిపోయారు..ఇక పోలీసుల వంతు?

By:  Tupaki Desk   |   15 Aug 2015 11:50 AM GMT
డ్రైవర్లు అయిపోయారు..ఇక పోలీసుల వంతు?
X
ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారి.. చికాకు పుట్టిస్తున్న మత్తయ్య.. జిమ్మీలపై తెలంగాణ ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఏ4గా ఉన్న మత్తయ్య.. ఏపీకి వెళ్లటం..ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధం ఉన్నట్లుగా తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ.. ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తన ఫోన్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ గన్ మెన్.. కారు డ్రైవర్ ఫోన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొనటం.. దానిపై విచారణ జరిపిన ఏపీ అధికారులు.. తగిన సాక్ష్యాలు లభించాయంటూ వారిద్దరికినోటీసుల ఇచ్చేందుకు ఏపీ సీఐడీ రంగంలోకి దిగటం తెలిసింది. ఈ మొత్తం చికాకుకి కారణమైన మత్తయ్య సంగతి చూడాలని తెలంగాణ ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని చట్టబద్ధంగా ముందుకు వెళ్లే వ్యూహంలో భాగంగా.. ఓటుకు నోటు కేసులో నిందితుడైన మత్తయ్యకు ఏపీ పోలీసులు ఆశ్రయం కల్పిస్తున్నారన్న ఆరోపణ మీద.. ఏపీ పోలీసు అధికారులు కొందరికి నోటీసులు ఇచ్చేందుకు టీ ఏసీబీ సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు. మత్తయ్యను ముందు ఫిక్స్ చేస్తే.. ఏపీ సర్కారుకు ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు మత్తయ్య మీద దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే ఈ కేసు వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ కారు డ్రైవర్ కు నోటీసులు ఇచ్చిన టీఏసీబీ.. తాజాగా ఏపీ పోలీసు అధికారులకు.. మరికొందరు టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చే దిశగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఇదో తాజా పరిణామంగా చెబుతున్నారు.