Begin typing your search above and press return to search.

అచ్చేదిన్ స్లోగ‌న్ మాది కాదంటున్న బీజేపీ

By:  Tupaki Desk   |   14 Sep 2016 9:27 AM GMT
అచ్చేదిన్ స్లోగ‌న్ మాది కాదంటున్న బీజేపీ
X
రాజ‌కీయాల్లో కొన్ని నినాదాలు - వ్యాఖ్య‌లు విప‌రీతంగా పాపుల‌ర్ అవుతాయి. అవి ఒక్కోసారి చేటు చేస్తే ఒక్కోసారి విప‌రీత‌మైన మైలేజి తెస్తాయి. కొంద‌రు నేత‌లు చెప్పే మాట‌లు శిలాక్ష‌రాల్లా నిలిచిపోతాయి... చ‌రిత్ర‌లో చెర‌గ‌ని ముద్ర వేస్తాయి. ఇందిరాగాంధీ గ‌రీబీ హఠావో నినాదం ఇప్ప‌టికే దేశ ప్ర‌జ‌ల‌కు గుర్తు.. గ‌లీగ‌లీమే షోర్ హై.. రాజీవ్ గాంధీ చోర్ హై అన్న నినాద‌మూ అంతే పాపుల‌ర్ అయింది. ఇలాంటివి ఒక‌ట్రెండు కాదు ఎన్నో ఉన్నాయి... తాజాగా న‌రేంద్ర మోడీ అచ్చే దిన్ స్లోగ‌న్ కూడా అంత‌కుమించి పాపుల‌ర్ అయింది. అచ్చే దిన్ ఆయేగా అంటూ బీజేపీ నేత‌లు ప్ర‌చారం చేసుకుంటుంటే... దాన్నే విమ‌ర్శ‌ల‌కు వాడుకుంటున్నాయి ప్ర‌తిప‌క్షాలు. అచ్చే దిన్ క‌బ్ ఆయేగా అంటూ నిల‌దీస్తున్నాయి. కొద్దికాలం అచ్చేదిన్ వ్యాఖ్య‌లపై సోష‌ల్ మీడియాలో బీజేపీకి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం జరుగుతుండ‌డంతో ప్ర‌ధాని మోడీ స‌హా బీజేపీ నేత‌లంతా ఇబ్బంది ప‌డుతున్నారు. ఇంత‌కాలం అద్బుతం అనుకున్న మాట‌లే ఇబ్బందిక‌రంగా మారుతుండ‌డంతో ఆ మాట‌లు త‌మ‌వి కావ‌ని... అది స్థూల భావ‌న‌తో చేసిన వ్యాఖ్య‌ల‌ని చెప్పుకొస్తున్నారు.

మాట్లాడితే చాలు మోడీ నోటి వెంట వినిపించే 'అచ్చే దిన్' స్లోగన్ తమది కాదన మోడీకి అత్యంత సన్నిహితుడైన మంత్రి నితిన్ గ‌డ్క‌రీ రీసెంటుగా వెల్ల‌డించారు. అచ్చే దిన్ స్లోగ‌న్ క్రెడిట్ గా కాకుండా భారంగా మారుతుండ‌డంతో ఆ మాట‌ల క్రెడిన్ ను మ‌న్మోహ‌న్ సింగుకు ఇచ్చేశారు. అచ్చేదిన్ అన్న మాట‌ల‌ను తొలిసారిగా వినిపించింది కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో మాట్లాడిన ఆయన, "మన్మోహన్ సింగ్ 'అచ్చే దిన్ ఆయేంగే' (మంచి రోజులు వస్తాయి) అని గ‌తంలో చెప్పారు... ఎప్పుడొస్తాయని ప్రశ్నిస్తే, భవిష్యత్తులో వస్తాయని చెప్పారు. మోడీ వచ్చిన తరవాతే మంచి రోజులు రావడం మొదలైంది. ఆ స్లోగన్ మాకో మైలురాయి అయింది. ఈ స్లోగన్ జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనం అని గ‌డ్క‌రీ చెప్పుకొచ్చారు.

అయితే మంచి రోజులు అనేదానికి క‌చ్చిత‌మైన నిర్వ‌చ‌నం లేద‌ని... మంచి రోజులు ఎప్పటికీ రావంటూ ఆయ‌న ఉదాహ‌ర‌ణ కూడా చెప్పారు. సైకిల్ ఉన్న వ్యక్తి - మోటార్ సైకిల్ కోరుకుంటాడు. మోటార్ సైకిల్ లభిస్తే - ఆ త‌రువాత అతని లక్ష్యం కారు అవుతుంది. కాబట్టి, మంచి రోజులు వచ్చాయని, ఇక చాలని ఎవరూ అనుకోరు అని గ‌డ్క‌రీ చెప్పారు. మొత్తానికి అచ్చేదిన్ స్లోగ‌న్ ను ఎలాగైనా వ‌దిలించుకోవాల‌న్న తాప‌త్రయం బీజేపీ నేత‌ల్లో బాగానే క‌నిపిస్తోంది.