Begin typing your search above and press return to search.

యాక్సిడెంట్ చేసి పారిపోతే 10 ఏళ్లు జైలుశిక్ష!

By:  Tupaki Desk   |   16 March 2021 11:30 PM GMT
యాక్సిడెంట్ చేసి పారిపోతే 10 ఏళ్లు జైలుశిక్ష!
X
ఇష్టారాజ్యంగా వాహనాల్ని నడపటం.. పరిమితి మించిన వేగంతో నడిపే వాహనాల్ని నియంత్రించే విషయంలో వైఫల్యం కొందరి ప్రాణాల్ని తీస్తుంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితుల్ని వదిలేసి పారిపోతే.. భారీ శిక్ష తప్పదని స్పష్టం చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. వాహనంతో గుద్దేసి.. తన మానాన తాను వెళ్లిపోతే.. పదేళ్ల జైలు తప్పదంటున్నారు. తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది.

ఒక స్టీల్ దుకాణంలో పని చేసే రమేశ్ కుమార్.. ఈ నెల ఎనిమిదిన సాయంత్రం వేళలో బైక్ మీద వేగంగా వెళుతున్నాడు. రాంచంద్రాపురం వద్ద రోడ్డు దాటుతున్న 75 ఏళ్ల వ్యక్తిని ఢీ కొన్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను వదిలేసి.. బండితో పరారయ్యాడు. ప్రమాదంలో గాయపడిన పెద్ద వయస్కుడ్ని స్థానికులు స్పందించి 108కు ఫోన్ చేస్తే.. అది వచ్చి ఆసుపత్రికి తరలించారు. తాను చేసిన ప్రమాదం గురించి పోలీసులకుసమాచారం ఇవ్వకపోగా.. బాధితుడ్ని పట్టించుకోనందుకు అతడ్ని అరెస్టు చేసి జైలుకు పంపారు.

అంతేకాదు.. ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల వాదన నెగ్గితే.. నిందితుడికి పదేళ్ల వరకు జైలు తప్పదని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవటం.. వాహనాలతో గుద్దేసి తమ దారిన తాము పోతున్న వారికి ముకుతాడు వేసేందుకు.. చట్టంలోని సెక్షన్లను తెర మీదకు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారికి వణుకు పుట్టేలా వ్యవహరిస్తున్నారు.

ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్టు ఏమంటే.. వాహనం నడిపిన కుర్రాడికి డ్రైవింగ్ లైసెన్సు లేదు. అంతేకాదు.. సొంత వాహనం కూడా కాదు. డ్రైవింగ్ లైసెన్సు లేకున్నా వాహనం ఇచ్చినందుకు సదరు వాహన యజమానిపైనా కేసు నమోదు చేశారు. గతంలో మాదిరి ఎవరికి పడితే వారికి బండిని ఇచ్చే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.ఈ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా.. లేనిపోని కేసుల్లో చిక్కుకోక తప్పదు.