Begin typing your search above and press return to search.

పాడె వెనుక పాడె.. ఊరంతా క‌దిలింది!

By:  Tupaki Desk   |   26 Jun 2018 4:31 AM GMT
పాడె వెనుక పాడె.. ఊరంతా క‌దిలింది!
X
ఒక దారుణ ప్ర‌మాదం.. ఏకంగా 15 మంది మృత్యువాత‌. మృతులంతా రెక్కాడితే కానీ డొక్కాడ‌ని కుటుంబాల వారే. క‌ష్టాన్ని న‌మ్ముకున్న వారికి ఎవ‌రూ తీర్చ‌లేనంత పెద్ద క‌ష్టం వ‌చ్చి ప‌డింది. ఒక‌డి నిర్ల‌క్ష్యం.. 15 కుటుంబాలు రోడ్డున ప‌డిన ప‌రిస్థితి. విషాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నీరుకొండ గ్రామం ఇప్పుడు క‌న్నీటికొండైంది.

డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్య‌క్తి న‌డిపిన ట్రాక్ట‌ర్ ఎక్కిన 15 మంది ప్ర‌మాద‌వ‌శాత్తు మూసీలో ప‌డిపోవ‌టం.. ప్రాణాలు కోల్పోయిన సంచ‌ల‌న విష‌యం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ గా మారిన ఈ ప్ర‌మాదం అంద‌రిని క‌లిచి వేసింది. ఇక‌.. నీరుకొండ‌లో ప‌రిస్థితి అయితే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. శోకం బ‌ద్ధ‌లై.. ఆ ఊరు మొత్తం శ్మ‌శాన వైరాగ్యంతో నిండిపోయింది. క‌దిలిస్తే చాలు.. భోరుమ‌నేస్తున్న ప‌రిస్థితి.

ఇంత దారుణం త‌మకే ఎందుకు జ‌రిగింద‌ని వారు విల‌పిస్తున్న వైనం అంద‌రిని క‌దిలించివేసింది. ప‌దిహేను మంది మృతుల కుటుంబాల్లో ప‌దిహేను ర‌కాల ప‌రిస్థితులు. ఇప్పుడేం చేయాల‌న్న ఆవేద‌న బాధితుల‌కే కాదు.. గ్రామంలోని వారు సైతం ఆవేద‌న చెందుతున్నారు. ఎంత‌లో ఎంత క‌ష్ట‌మొచ్చింద‌న్న బాధ అంద‌రి నోటా వినిపించింది.

ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన 15 మంది అంత్య‌క్రియల కోసం నీరుకొండ ఏక‌మైంది. ఊరు ఊరంతా 15 మంది అంత్య‌క్రియ‌ల కోసం క‌దిలారు. పాడె వెనుక పాడెను క‌ట్టి.. ఊరు మొత్తం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైంది. బాధిత కుటుంబాల్లో కొంద‌రు చిన్నారులు ఉండ‌టం.. త‌మ అమ్మ‌కు ఏమైందో అర్థం కాక బిక్క‌ముఖం వేసి ఏడుస్తూ.. అమ్మ కావాలంటూ అడుగుతున్న వైనం ప‌లువురిని క‌లిచివేసేలా చేసింది.

పాడె వెనుక పాడె క‌దులుతూ.. వారికి ద‌హ‌న సంస్కారాలు పెట్టేందుకు ముక్క‌ప‌చ్చ‌లార‌ని చిన్నారులు బ‌య‌లుదేర‌టం ప‌లువురిని క‌లిచివేసింది. ట్రాక్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారంద‌రిని ఒకేచోట‌.. వ‌రుస‌గా చితులు పేర్చి సామూహికంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఈ ప్ర‌మాదంలో ద‌ళిత‌వాడ‌కు చెందిన ఆరుగురు మ‌ర‌ణించారు. ఈ మ‌హా విషాదంతో ఊరు మొత్తం ఒక‌టైంది.కులాల‌కు.. మ‌తాల‌కు అతీతంగా ఉండాల‌న్న నిర్ణ‌యంతో పాటు.. అంద‌రిని ఒకేచోట సామూహికంగా ద‌హ‌నం చేయాల‌ని నిర్ణ‌యించారు.

అంత్య‌క్రియ‌ల కోసం పాడె వెనుక పాడె క‌ద‌ల‌గా.. ఊరు మొత్తం హాజ‌రైంది. విదేశాల్లో ఉన్న కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు.. బాధిత కుటుంబాల బంధువులు నీరుకొండ‌కు పోటెత్తారు. మృతుల జ్ఞాపకార్థం ఊర్లో ప్రత్యేకంగా ఓ స్థూపం నిర్మించాలని గ్రామస్థులు భావిస్తున్నారు. నీరుకొండ‌ను చుట్టేసిన మ‌హాశోకం ఇప్ప‌ట్లో ఆ ఊరిని వ‌దిలేలా లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.