Begin typing your search above and press return to search.

ప్రభుత్వ సర్వే ప్రకారం సొంత సెల్ ఫోన్లు ఉన్న మహిళలు ఈ రాష్ట్రంలోనే ఎక్కువ!

By:  Tupaki Desk   |   1 Jun 2022 2:30 AM GMT
ప్రభుత్వ సర్వే ప్రకారం సొంత సెల్ ఫోన్లు ఉన్న మహిళలు ఈ రాష్ట్రంలోనే ఎక్కువ!
X
మనదేశంలో పురుషులు కంటే మహిళలే సెల్ ఫోన్లు ఎక్కువ వినియోగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) - 5 వెల్లడించింది. సాంకేతికంగా దేశం ఎంతో ముందుకు వెళ్లినా మహిళలు ఇప్పటికీ పురుషుల కంటే సొంత సెల్‌ఫోన్ల వినియోగంలో వివక్ష ఎదుర్కొంటున్నట్టు సర్వే వివరించింది.

ఈ మేరకు దేశవ్యాప్తంగా 7,24,115 మంది మహిళలను ఇంటర్వ్యూ చేస్తే అందులో సగంమంది మాత్రమే తమకు ప్రత్యేకంగా సెల్‌ఫోన్‌ ఉందని చెప్పారని కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. పైగా సెల్ ఫోన్లు మహిళల్లోనూ కేవలం 71 శాతం మందికి మాత్రమే టెక్ట్స్‌ మెసేజ్‌లు చదవగలిగే సామర్థ్యం ఉందని నివేదిక వెల్లడించింది.

కాగా మహిళా సాధికారత, తదితర అంశాల్లో భాగంగా 15-49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఉపాధి, సంపాదన, సంపాదనపై నియంత్రణ, యాజమాన్య హక్కులు, మొబైల్‌ ఫోన్‌ వినియోగంపై 2019-21 మధ్య ఈ సర్వే నిర్వహించారు.

అయితే సొంత సెల్‌ఫోన్లు వినియోగిస్తున్న మహిళల సంఖ్య దేశంతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లో గణనీయంగా పెరగడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో సొంత సెల్ ఫోన్ల మహిళల సంఖ్య గత సర్వేలో 36.2 శాతం ఉండగా ఈసారి 48.9 శాతానికి పెరిగింది. అంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం 12.7 శాతం మంది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మహిళలు సొంత ఫోన్లు కలిగి ఉన్నారు. ఇది అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్రతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందని పేర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు 66.29 కోట్ల్ల మంది మహిళలున్నారు. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం.. సొంత సెల్‌ఫోన్లు వినియోగిస్తున్న మహిళల్లో గోవా అగ్రస్థానంలో నిలవగా.. మధ్యప్రదేశ్‌ అట్టడుగున నిలిచింది. గోవాలో సర్వేచేసిన 2,030 మంది మహిళల్లో 91.2 శాతం మందికి సొంత ఫోన్లు ఉండటం గమనార్హం. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లో సర్వే చేసిన 48,410 మంది మహిళల్లో 38.5 శాతం మందికే సొంత ఫోన్లున్నాయి. ఇక తెలంగాణలో 60 శాతం మంది మహిళలకి సొంత ఫోన్లు ఉన్నాయి.

అలాగే దేశవ్యాప్తంగా 2015-16 సర్వేతో పోలిస్తే తాజా గణాంకాలు మెరుగుదలను సూచిస్తున్నాయి. సొంత ఫోన్లు ఉన్న మహిళలు గతంలో 46 శాతం ఉండగా అది ఇప్పుడు 54 శాతానికి చేరింది. మరోవైపు చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిక్కిం, లక్షద్వీప్, పుదుచ్చేరి, నాగాలాండ్, మిజోరంతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌ వంటి పెద్ద రాష్ట్రాలు వెనుకబడి ఉండటం గమనార్హం.