Begin typing your search above and press return to search.
కేటీఆర్ మాట.. మోడీ విశ్వ గురు కాదు ... విష గురు
By: Tupaki Desk | 9 Feb 2022 7:30 AM GMTరాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ విరుచుకుపడుతోంది. దశాబ్దాల పాటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణను, పోరాటం చేసిన అమరవీరుల త్యాగాన్ని బీజేపీ నేతలు అవమానిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా ప్రధానిపై విరుచుకపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రధానిపై మండిపడ్డారు. ఆయన విశ్వ గురు కాదు విష గురు అని టార్గెట్ చేశారు.
దశాబ్దాల పోరాటం, ప్రాణ త్యాగాలను పార్లమెంట్ సాక్షిగా మోడీ కించపరిచారని కేటీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని అవమానించేలా ఉందని, ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ అన్నారు.
వెంటనే ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రధాని విశ్వ గురు కాదు విష గురు అంటూ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ ట్వీట్ చేయడం గమనార్హం.
ప్రధాని మోడీ వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజల హృదయాలు చాలా దుఃఖంతో బాధపడుతున్నాయని మహబూబబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. ‘‘దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నందుకు ప్రధాని మోడీలో అక్కసు కనిపిస్తోంది. అభివృద్ధిలో తెలంగాణ.. గుజరాత్ ను దాటిపోయింది.
దేశం మొత్తం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను చూస్తున్నారు. బీజేపీ కొత్తరకం కుట్రలకు తెర లేపింది.`` అంటూ విరుచుకుపడుతున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు, రైతులు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు.