Begin typing your search above and press return to search.

అచ్చెన్నను స్కాంలో ఇరికించింది ఇతడే?

By:  Tupaki Desk   |   12 Jun 2020 2:45 AM GMT
అచ్చెన్నను స్కాంలో ఇరికించింది ఇతడే?
X
ఈఎస్ఐ స్కామ్ బయటపడింది. చంద్రబాబు అనుంగ శిష్యుడు టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని ఈ ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనమైంది.. చంద్రబాబు హయాంలో నాటి కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ తో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఏపీలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన కుంభకోణం.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న ఈ స్కామ్ అసలు ఎలా బయటపడిందనేది ఆసక్తిగా మారింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం బయటపడడానికి కారకులెవరు? వైసీపీ ప్రభుత్వం తవ్వి తీసిన ఈ స్కామ్ ను అసలు బయటపెట్టింది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ. మధు. ఆయన ఫిర్యాదు వల్లే ఇవాళ టీడీపీ పునాదులు కదిలే అతిపెద్ద కుంభకోణం బయటపడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మొదట ఈ ఈఎస్ఐ స్కామ్ తెలంగాణలో బయటపడింది. అయితే ఈ మూలాలు ఏపీలోనూ ఉన్నాయి.. ఇది భారీ అవినీతి అని.. దీన్ని ఏసీబీతో విచారణ జరిపించాలని సీపీఎం మధు ఈ ఏడాది జనవరి 10న సీఎం జగన్ కు లేఖ రాయడంతో ఈ స్కామ్ వెలుగుచూసింది. తెలంగాణలో ఈఎస్ఐ అవినీతిలో మోసానికి పాల్పడ్డ మెడికల్ కంపెనీలు ఏపీలోనూ ఇలానే చేశాయని దీనిపై విచారణ జరపాలని మధు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలు కార్మికుల సొమ్మును కొల్లగొట్టినట్లు మధు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

మధు లేఖపై జగన్ సర్కారు సీరియస్ గా దృష్టి సారించింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ తో తో విచారణ జరిపించింది.ఈ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత, చంద్రబాబు రైట్ హ్యాండ్ అయిన నాటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందని దర్యాప్తులో తేలినట్టు సమాచారం. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్ లో తేలింది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో అవినీతి జరిగిందని, అచ్చెన్నాయుడు హస్తం ఉందని తేలడంతో ఏసీబీ అధికారులు ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కోటేషన్లు తీసుకొని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ.51 కోట్లు చెల్లించినట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాల వాస్తవ ధరకంటే 136శాతం అధికంగా సంస్థలు టెండర్లు చూపించినట్టు విచారణలో తేలింది. తద్వారా అక్రమంగా రూ.85 కోట్లు చెల్లించినట్టు విచారణలో తేలింది.

నామినేషన్ ప్రాతిపదికన 3, లేదా 4 కంపెనీల నుంచే మందులు కొనుగోలు చేశారని.. దీనికి అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాసిన లేఖే ప్రాతిపదికన నివేదికలో తేలింది. దీంతో మాజీ మంత్రి అచ్చెన్నను ఈ ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వైసీపీపై ఒంటికాలిపై లేచే అచ్చెన్నకు ఈఎస్ఐ స్కాం గుదిబండగా తయారైంది. ఆయనను బుక్ చేసే అవకాశం వైసీపీ సర్కారు కు దొరికినట్టైంది. సీపీఎం మధు రాసిన లేఖే ఇప్పుడు మాజీ మంత్రి అచ్చెన్న అరెస్ట్ కు కారణమైంది. ఈ పెద్ద స్కాంలో ఇరికించినట్టైంది. టీడీపీని కలవరపాటుకు గురిచేసింది.