Begin typing your search above and press return to search.

జనాలను నిందించిన అచ్చెన్న

By:  Tupaki Desk   |   15 April 2022 3:28 AM GMT
జనాలను నిందించిన అచ్చెన్న
X
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోవటాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. అందుకనే అంబద్కేర్ జయంతి సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతు ప్రజలకు టీడీపీ ప్రభుత్వం ఏమి తక్కువ చేసిందని ఓడగొట్టారో చెప్పాలంటు మండిపడటమే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో మూడేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరఓటమికి సమాధానం చెప్పాలని ఇపుడు నిలదీయటం ఏమిటో అర్ధం కావటంలేదు.

ఏ పార్టీకి ఓట్లేయాలో నిర్ణయించుకునే స్వేచ్చ జనాలకు ఉందన్న విషయాన్ని కూడా చంద్రబాబునాయుడు, అచ్చెన్న మరచిపోయినట్లున్నారు. అధికారంలో ఉన్నపుడు తామిన్ని పథకాలు అమలు చేశాం కాబట్టి తమకు మాత్రమే ఓట్లేయాలని జనాలను నిర్భిందించలేమని వీళ్ళకు అర్ధం కావటంలేదు. సామాజిక న్యాయం చేయటంలో టీడీపీనే టాపని అచ్చెన్న చెప్పుకున్నారు. తమ పార్టీ, ప్రభుత్వం ఘనతను చెప్పుకోవటంలో ఎలాంటి తప్పులేదు. అయితే వీళ్ళు చెప్పుకున్న గొప్పదనాన్ని జనాలు అంగీకరించాలి.

తమ హయాంలో దళితులకు, బీసీలకు, మైనారిటీలకు, గిరిజనులకు ఎన్నో మంచి పనులు చేసినట్లు అచ్చెన్న చెప్పుకున్నారు. ఇన్ని మంచి పనులు చేసిన తర్వాత కూడా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందంటే జనాల్లో చైతన్యం లేకపోవటమే కారణమంటు మండిపడ్డారు.

జనాలు మోసపోతున్నారని, ఇప్పటికైనా చైతన్యం తెచ్చుకోలేకపోతే అందరిది బానిస బతుకులైపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. తమ ఐదేళ్ళ పాలన చాలా గొప్పగా జరిగిందని పదే పదే చెప్పుకుని తమను ఎందుకు ఓడించారో చెప్పాలంటు అచ్చెన్న జనాలను నిలదీయటం వల్ల ఎలాంటి ఉపయోగంలేదు.

ఎన్ని పథకాలు అమలుచేసినా జనాలకు నచ్చకపోతే ఓట్లేయరని ఇప్పటికే అచ్చెన్నకు అర్ధమయ్యుండాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయినా వచ్చే ఎన్నికల్లో జనాలు వైసీపీకి ఓట్లేయకపోతే చేయగలిగేదేమీలేదు.

కాబట్టి జనాలను నిలదీయటం మానేసి తమకు జనాలు ఎందుకు ఓట్లేయలేదనే విషయమై నిజాయితీతో విశ్లేషించుకుంటే సమాధానం దొరుకుతుంది. అలాకాదని జనాలను నిందిస్తుంటే మరో ఐదేళ్ళు టీడీపీ ప్రతిపక్షంలోనే కూర్చున్నా సమాధానాలు దొరకవు.