Begin typing your search above and press return to search.

అడుగులు వేస్తున్న ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ

By:  Tupaki Desk   |   11 July 2015 11:27 AM GMT
అడుగులు వేస్తున్న ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ఒకదాని తర్వాత మరొకటిగా అడుగులు వేస్తోంది. వ్యవసాయ వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడినా.. వైస్‌ చాన్సలర్‌ చాంబర్‌ సిద్ధమవుతోంది. ఈనెల 12వ తేదీ ఆదివారం దీనిని ప్రారంభించనున్నారు. దీనిని ప్రారంభిస్తే ఎన్జీ రంగా వర్సిటీ ఏర్పాటు దిశగా మొదటి అడుగు పడినట్లే!

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ మొత్తం తెలంగాణకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ ఒక్క వర్సిటీ విభజనతోనే సీమాంధ్ర దాదాపు రూ.15 వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. హైదరాబాద్‌లోని ఎన్జీ రంగా వర్సిటీ పేరును జయశంకర్‌ వర్సిటీగా మార్చడంతో.. ఇప్పుడు ఎన్జీ రంగా యూనివర్సిటీని గుంటూరులోని లాం పాంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నెలలో రాజధానికి శంకుస్థాపన చేసినప్పుడే దీనికి కూడా శంకుస్థాపన చేయాలని భావించారు. కానీ, అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఇది వాయిదా పడింది. దాంతో వర్సిటీకి శంకుస్థాపన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందనేది అగమ్యంగా మారింది.

వర్సిటీ ఏర్పాటు.. భవనాల నిర్మాణం మొత్తం రెండు మూడేళ్లు పడితే మరి వైస్‌ చాన్సలర్‌తోపాటు అధికారులంతా ఎక్కడ ఉంటారు. అందుకే ముందుగా నవ్యాంధ్ర రాజధానిలో క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. లాం ఫారంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ క్యాంపు ఆపీసును ఏర్పాటు చేశారు. దీనికి ఆదివారం వీసీ ప్రారంభోత్సవం చేయనున్నారు. తద్వారా, వ్యవసాయ వర్సిటీ కార్యకలాపాలు ఇకనుంచి నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచే సాగనున్నాయి. తద్వారా ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా మరొక అడుగు ముందుకు పడినట్లే!!