Begin typing your search above and press return to search.

మాజీమంత్రి హస్తం: ఏపీలో మరో కుంభకోణం వెలుగులోకి..

By:  Tupaki Desk   |   21 Feb 2020 8:29 AM GMT
మాజీమంత్రి హస్తం: ఏపీలో మరో కుంభకోణం వెలుగులోకి..
X
తెలంగాణలో భారీ ఈఎస్ ఐ స్కామ్ వెలుగుచూసిన విషయం తెలిసిందే. అలాంటి స్కామ్ ఆంధ్రప్రదేశ్ లోనూ చోటుచేసుకుంది. ఆ అవినీతి ఆంధ్రప్రదేశ్ కు కూడా పాకింది. మెడిసిన్స్ - ల్యాబ్ కిట్స్ - బయోమెట్రిక్ మెషీన్స్ - ఫర్నీచర్ - ఈసీసీ సర్వీసులు - బయోమెట్రిక్ యంత్రాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఏపీ ఈఎస్ఐకి చెందిన ముగ్గురు మెడికల్ డైరెక్టర్లు రవికుమార్ - రమేశ్ కుమార్ - విజయ్ కుమార్‌ ఐదేళ్ల కాలంలో దాదాపు రూ.400 కోట్లు ప్రభుత్వానికి నష్టం కలిగించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఈడీ సేకరించింది. వీటిలో అప్పటి మంత్రి - ప్రస్తుత ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కుంభకోణంపై వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

వాస్తవ ధర కంటే 132 శాతం ఎక్కువ ధరకు మందుల కొనుగోళ్లు చేసి భారీగా ప్రభుత్వ సొమ్ము నొక్కేశారని తెలుస్తోంది. ఒక్కో బయోమెట్రిక్ వాస్తవ ధర రూ.16 వేలు కాగా.. రూ.70 వేలకు వాటిని విక్రయించినట్టు విజిలెన్స్ గుర్తించింది. నకిలీ కంపెనీల పేరుతో బిల్లులు సృష్టించి నిధులు మళ్లించినట్టు తేలింది. మెడికల్ కోసం ప్రభుత్వం రూ.293 కోట్లు ఈఎస్ ఐకి కేటాయించగా.. అధికారులు రూ.698 కోట్ల బిల్లులు సృష్టించినట్టు తేల్చడంతో అధికారులు షాక్ కు గురయ్యారు.

లోతుగా విచారణ చేస్తే ఈ స్కామ్‌ లో ముగ్గురు డైరెక్టర్లతో పాటు ఆరుగురు జాయింట్ డైరెక్టర్ల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు పేరు ఉండడంతో టీడీపీకి షాక్ తగిలింది. నిజానికి మెడికల్ కొనుగోళ్లను టెండర్ పద్ధతిలో చేపట్టాలనే నిబంధన ఉండగా అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు మేరకు అనుమతి లేని కొన్ని కంపెనీల నుంచి నామినేషన్ పద్ధతిలో రూ.51 కోట్ల మెడిసిన్ కొనుగోళ్లు చేశారని గుర్తించారు. దీంతో ఆయన ఈ కుంభకోణంలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందని సమాచారం.

టెలీ హెల్త్ సర్వీసెస్ అనే కంపెనీ నుంచి మందుల కొనుగోళ్లకు అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. విజిలెన్స్ శాఖ ఈ స్కామ్‌ పై ప్రభుత్వానికి నివేదిక అందచేయడంతో.. దీనిపై విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఈ స్కామ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే తరహా కుంభకోణం తెలంగాణలో వెలుగులోకి రాగా ప్రజాప్రతినిధుల పాత్ర ఏమి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కుంభకోణంలో అప్పటి మంత్రి హస్తం కూడా ఉండడంతో ఈ కుంభకోణం భారీ మొత్తంలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారం 2014-19 మధ్య జరిగినట్టు గుర్తించారు. దాదాపు రూ.153 కోట్ల అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా దీనిపై లోతుగా విచారిస్తే పెద్ద సంఖ్యలో ప్రమేయం ఉన్న వారి పేర్లు మరికొన్ని పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కార్మికుల కోసం కేటాయించే సొమ్మును ఈ విధంగా అధికారులు దోచుకోవడం కలవరపెడుతోంది. ముఖ్యంగా కార్మిక శాఖ కింద ఉన్న ఈ ఈఎస్ ఐలో తెలుగు రాష్ట్రాల్లో కుంభకోణాలు జరగడం కలకలం రేపుతోంది. తెలంగాణలో ఈ కేసు విషయంలో చర్యలు చేపట్టి విచారణ పూర్తవుతుండగా ఈ కేసు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో జరిగిన కుంభకోణానికి తెలంగాణలో జరిగిన దానికి కొంత సంబంధాలు ఉండవచ్చని తెలుస్తోంది. త్వరలోనే అన్ని విషయాలు అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.