Begin typing your search above and press return to search.

రూ.అరకోటికి మద్యం బాటిళ్ల బేరం..ఏసీపీ సస్పెండ్‌

By:  Tupaki Desk   |   25 April 2020 12:32 PM GMT
రూ.అరకోటికి మద్యం బాటిళ్ల బేరం..ఏసీపీ సస్పెండ్‌
X
లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలన్నీ మూసి వేసి ఉన్నాయి. ఎక్కడా కూడా చుక్క మందు లభించడం లేదు. అయితే ఈ సమయంలో కొందరు ప్రభుత్వ అధికారులు - పోలీస్‌ అధికారులు తమ పలుకుబడి ఉపయోగించుకుని మద్యం సరఫరా అక్రమంగా చేస్తున్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే ముఖ్యంగా పోలీస్‌ అధికారులు తమ కన్నుసన్నల్లో మద్యం తరలిస్తున్నారు. ఈ క్రమంలో దొరికితే దొంగ దొరకకుంటే దొరగా మారుతున్నారు. ఈ విధంగానే ఒక పోలీస్‌ ఉన్నతాధికారి మద్యం తరలిస్తున్న వారిని అడ్డుకుని వారిని వదిలేసేందుకు ఏకంగా అరకోటి డిమాండ్‌ చేసిన సంఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కొంతమంది అత్యధిక ధర కలిగిన వంద మద్యం బాటిళ్లను ఓ వాహనంలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. అయితే ఆ మద్యం వాహనం వదిలేయాలంటే రూ.50 లక్షలు ఇచ్చుకోవాలని బెంగళూరు తూర్పు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాసు డిమాండ్‌ చేశారు. ఈ విషయం మద్యం వ్యాపారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు రావడంతో తాజాగా అతడిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మద్యం తరలిస్తున్న నిందితులతోపాటు ఇప్పుడు ఏసీపీ కూడా బలయ్యాడు.

ఈ ఉదంతం అంతా ఏప్రిల్ 11వ తేదీన చోటుచేసుకుంది. జీఎస్టీ ఎమర్జెన్సీ బోర్డు పేరు పెట్టుకుని విశేష్ గుప్తా - గోపా ఓ టాటా సుమో వాహనం బెట్టడసనపుర మెయిన్ రోడ్డు నుంచి వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న ఏసీపీ వాసు ఆపి తనిఖీ చేశారు. ఆ కారులో 8 డబ్బాల్లో అత్యంత విలువైన 100 మద్యం బాటిళ్లు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసిన ఏసీపీ వాసు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. తమకు ఓ పోలీసు ఉన్నతాధికారి బాగా తెలుసునని నిందితులు ఏసీపీతో చెప్పడంతో పాటు తమను విడిచిపెడితే రూ.50 లక్షలు ఇస్తామని ఏసీపీకి ఆఫర్‌ ఇచ్చారు. ఆ మద్యం బాటిళ్లు అదనపు సీపీ మురగన్‌ కు సంబంధించినవని - నిందితులకు బెయిల్ ఇవ్వాలంటూ అదనపు సీపీ కరోరారు. దీంతో ఏప్రిల్ 12వ తేదీన ఏసీపీ వాసును మదివల పోలీస్ స్టేషన్‌ కు పిలిపించి ఆ నిందితులిద్దరినీ బెయిల్‌ పై వదిలేయాలని ఆదేశాలు వచ్చాయి.

అయితే పోలీస్‌ స్టేషన్‌ కు రాగా సీన్‌ రివర్సయ్యింది. ఏసీపీ వాసు తనను రూ.50 లక్షల లంచం అడిగినట్లు నిందితుల్లో ఒకడైన విశేష్ అదనపు సీపీకి ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు కానిస్టేబుల్‌ జనార్దన్కు లంచం తీసుకునే బాధ్యతను అప్పగించాడని తెలపడంతో ఏసీపీ వాసు అవాక్కయ్యాడు. దీంతో ఏసీపీ వాసును సస్పెండ్ చేస్తూ పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఏసీపీ వాసును ఉద్దేశపూర్వకంగా ఇరికించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదనపు సీపీ మురుగన్ ఆయనపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే వాస్తవమేమిటనేది సస్పెన్స్‌ గా మారింది. తనిఖీల సమయంలో ఒకలా.. పోలీస్‌ స్టేషన్‌ లో మరోలా నిందితులు మాట్లాడడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. వాస్తవమేమిటో త్వరలోనే తేల్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.