Begin typing your search above and press return to search.

పట్టాభి కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు

By:  Tupaki Desk   |   29 Oct 2021 10:30 AM GMT
పట్టాభి కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు
X
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. అరెస్ట్ సందర్భంగా నిబంధనలు సరిగా పాటించకపోవడంతో ఉన్నాధికారులు చర్యలు తీసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేష్, సీఐ నాగరాజుపై వేటు వేశారు. పట్టాభి అరెస్ట్ సమయంలో నోటీసులు జారీ చేసిన విషయంలో అలసత్వం వహించారన్న కారణంగా ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేశారు. 41ఏ సీఆర్‌పీసీ కింది పట్టాభికి పోలీసులు నోటీసులిచ్చారు. ఆ నోటీసుల్లో ఖాళీగా ఉండడాన్ని న్యాయస్థానం కూడా తప్పుబట్టింది.

ఈ నేపథ్యంలోనే పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేష్, సీఐ నాగరాజును విధుల నుంచి తప్పించారు. ఏసీపీ రమేష్ కొంతకాలంగా టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. నాగారాజు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్నారు. ఏసీపీ రమేష్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఐ నాగరాజును ఏలూరు రేంజ్ డీఐజీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

మరోవైపు పట్టాభిని ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌ను గురువారం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. పట్టాభిని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావించారు. పట్టాభి తరపున న్యాయవాది లక్ష్మీనారాయణ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టాభికి ఇప్పటికే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని తెలిపారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ ఇన్‌ సక్సెస్‌ అవుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చారు.