Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు షాకిచ్చిన ‘‘హంస’’

By:  Tupaki Desk   |   31 Dec 2015 4:35 AM GMT
కేటీఆర్ కు షాకిచ్చిన ‘‘హంస’’
X
బ్రాండ్ హైదరాబాద్ పేరుతో శిల్పారామంలో మంత్రి కేటీఆర్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించటం తలిసిందే. తాను చెప్పాల్సింది చెప్పేశాక.. ప్రజలు అడగాల్సిన ప్రశ్నలు అడగొచ్చంటూ అవకాశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా హంసా ఫౌండేషన్ కు చెందిన ఒక మహిళ మంత్రి కేటీఆర్ కు చుక్కలు చూపించారు. కూల్ కూల్ అంటూ ఆయన సముదాయించాల్సి వచ్చింది. మంచినీళ్లు ఇవ్వడంటూ చెప్పాల్సి వచ్చింది. ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగిన ఆమె.. కేటీఆర్ సహనానికి పరీక్ష పెట్టారు.

దాదాపు 18 ప్రశ్నలు అడిగిన సదరు మహిళను కార్యక్రమ నిర్వాహకులు శాంతపరిచే ప్రయత్నం చేయటం.. దానికి ఆమె ఘాటుగా స్పందించటంతో వాతావరణం వేడెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో బాగానే తెలిసిన కేటీఆర్ ఆమెను మాట్లాడాలంటూ సముదాయించే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ ఒక ప్రశ్న వేసి అడ్డంగా బుక్ అయ్యారు.

మీరు ఎప్పుడైనా ఒక మంత్రిని ఇలా ప్రశ్నించగలిగారా? మాట్లాడగలిగారా? అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తే.. బుల్లెట్ మాదిరి సమాధానం ఇచ్చిన ఆ మహిళ.. మంత్రిని కాదు.. ముఖ్యమంత్రినే ప్రశ్నించా అనటంలో సభలో ఒక్కసారిగా ఈలలు.. కేకలతో దద్దరిల్లింది. ఎవరా? ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ అడిగితే.. ఇంకెవరూ రెడ్డిగారు అంటూ ఆ మహిళ బదులిచ్చింది. ఈ సందర్భంలో సదరు ముఖ్యమంత్రి పేరు చెప్పేందుకు తడబడిపోవటం.. చూశారా? మర్చిపోయారని కేటీఆర్ కాస్త ఎటకారంగా అంటే.. అయినా ఆంధ్రా ముఖ్యమంత్రుల్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? అంటూ గడుసుగా సమాధానం ఇవ్వటం గమనార్హం.

ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగిన ఆమె తీరును నిర్వాహకులు కల్పించుకొని.. 18 ప్రశ్నలు మీరొక్కరే అడిగితే.. మిగిలిన వారికి అవకాశం ఇవ్వరా? అంటూ అసహనంతో ఆమె బలవంతంగా కూర్చోవాల్సి వచ్చింది. మంత్రితో మాట్లాడే అవకాశం మీకు కల్పించాను చూశారా? అని కేటీఆర్ ప్రశ్నిస్తే.. మంత్రి కాదు.. ముఖ్యమంత్రితోనే మాట్లాడాం అన్న సమాధానం కేటీఆర్ ఊహించనిదిగా చెప్పొచ్చు. ఈ హంస ఫౌండేషన్ నిర్వాహకురాలిని కేటీఆర్ అంత త్వరగా మర్చిపోలేరేమో?