Begin typing your search above and press return to search.

పవన్ కు ఆలీ పంచ్ లు.. రాజకీయల కోసం అవసరమా?

By:  Tupaki Desk   |   9 April 2019 5:01 AM GMT
పవన్ కు ఆలీ పంచ్ లు.. రాజకీయల కోసం అవసరమా?
X
దరిద్రపుగొట్టు రాజకీయాలని ఊరికే అనరేమో? చక్కగా ఉండే ఇద్దరిని బద్ధ శత్రువులుగా చేసే మేజిక్ రాజకీయాల సొంతం. దీని పుణ్యమా అని భార్యభర్తలు బద్ధ శత్రువులుగా మారటమే కాదు.. తండ్రి.. కొడుకులు.. అన్న.. తమ్ముడు.. ఇలా రక్త సంబంధం ఉన్నోళ్లే కాట్ల కుక్కల్లా కొట్టుకునేలా పురిగొల్పే శక్తి రాజకీయం సొంతం. అలాంటిది.. ఇద్దరు స్నేహితుల మధ్య వైరాన్ని పెంచదా?

తాజా ఎపిసోడ్ చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు హాస్య నటుడు ఆలీకి మధ్యనున్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ లాంటి స్టార్ హీరో తాను నటించే ప్రతి సినిమాలో తన స్నేహితుడు అలీకి ఒక పాత్ర ఉండాలనుకోవటం పవన్ మంచితనం అనుకోవాలా? ఆలీ గొప్పతనం అనాలా?

పవన్ కోరుకోవాలే కానీ.. ఆలీ లాంటోళ్లు వంద మందిని తన సినిమాలో పెట్టుకోగలరు. అదే అలీ అనుకుంటే.. చేయలేరు కదా? ఈ తేడా స్పష్టంగా తెలిసినప్పుడు.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంలో అర్థం లేదు. కానీ.. తాజా ఎపిసోడ్ లో పవన్ ను ఉద్దేశించి ఆలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

రాజకీయాల్ని కాసేపు పక్కన పెడితే.. గీత దాటేసి మరీ.. ఆలీ చేసిన వ్యాఖ్యలు సినీ..రాజకీయ రంగాల్లోని పలువురిని ఆశ్చర్యానికి గురి చేసేలా మారాయి. పవన్ మీద సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరు వేలెత్తి చూపించే ప్రయత్నం చేశారు. కానీ.. తాజాగా పవన్ తన మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆలీ స్పందన చూసి ఆశ్చర్యపోతున్న పరిస్థితి.

రాజమండ్రి సభలో పవన్ ఉద్దేశించి చసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆలీ ఊహించిన రీతిలో రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పవన్ గురించి కానీ ఆయన పార్టీ గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదని.. కానీ పవన్ మాత్రం తన గురించి వ్యాఖ్యలు చేయటం తగదన్నారు.

ఈ సందర్భంగా పవన్ ను ఉద్దేశించి ఆలీ ఒక వీడియోను విడుదల చేశారు. పవన్ తన అన్న చిరు వేసిన బాటలో పైకి వచ్చారని.. కానీ తాను మాత్రం అలా కాదని.. కష్టంతోనే సినీ పరిశ్రమలో పైకి వచ్చినట్లుగా వచ్చారన్నారు. పవన్ ఏదో తనకు సాయం చేసినట్లుగా చెప్పటం వాస్తవం కాదన్నారు. పవన్ సినిమాల్లోకి వచ్చేటప్పటికి తాను పరిశ్రమలో ఒక స్థానం సంపాదించుకున్నట్లుగా చెప్పి షాకిచ్చారు.

ఏ రకంగా పవన్ నాకు సాయం చేశారు? అని ప్రశ్నించి ఆలీ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పవన్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆపీసుకు వెళ్లి ఖురాన్ ప్రతిని.. ఖర్జురాలను ఇచ్చానని.. అలాంటి తాను వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరకూడదా? అని ప్రశ్నించారు. తన చుట్టం టికెట్ అడిగితే ఇచ్చానని.. అలాంటిది ఆలీకి ఇవ్వనా? అని పవన్ ప్రశ్నించారని.. తన నెంబరు పవన్ దగ్గర ఉందంటూ ఆలీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా గీత దాటేసినట్లుగా చెబుతున్నారు.

పలు సినిమా ఫంక్షన్ల సందర్భంగా అసందర్భ ప్రేలాపనలతో.. నోటికి వచ్చినట్లుగా బూతు వ్యాఖ్యలు చేసే ఆలీ.. పవన్ మీద చేసిన వ్యాఖ్యల్లో అహంకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న విమర్శ వినిపిస్తోంది. ఆలీ తొందరపడ్డారా? అన్నది టైం తేల్చాల్సిన విషయంగా చెప్పక తప్పదు.