Begin typing your search above and press return to search.
'30 ఈయర్స్' జోస్యం..కాబోయే సీఎం జగనే!
By: Tupaki Desk | 31 July 2018 10:17 AM GMTప్రజాసంక్షేమ యాత్రను వైసీపీ అధ్యక్షుడు జగన్ దిగ్విజయంగా కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. మడమ తిప్పని మాట తప్పని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే ఆయన తనయుడు జగన్ కూడా పయనిస్తూ వేల కిలోమీటర్ల మేర చేపడుతోన్న పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్న విషయం విదితమే. జగన్ కు వస్తోన్న ఆదరణ చూసి... ఇప్పటికే వైసీపీలో పలువురు కీలకమైన నేతలు చేరుతున్నారు. మరోవైపు, కొందరు సినీ ప్రముఖులు కూడా జగన్ వైపు అడుగులు వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జగన్ ను విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి - స్టార్ కమెడియన్ పృథ్వీ రాజ్ లు కలిసి వైసీపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీ మరోసారి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలన్నీ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పృథ్వీ జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఆప్ తరహాలో వైసీపీ సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల్లో వైసీపీదే గెలుపని - జగన్ సీఎం అవుతారని - కావాలంటే ఈ విషయాన్ని రాసిపెట్టుకోవచ్చని పృథ్వి బల్లగుద్ది మరీ చెప్పారు. జగన్ పై వస్తోన్న విమర్శలన్నీ నిజం కాదని...వాటిని పట్టించుకోవాల్సిన అవసరం తేదని అన్నారు. జగన్ ను తాను దగ్గర నుంచి చూశానని - ఆయన మనస్తత్వం గురించి పూర్తిగా తెలుసని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో జగన్ కు వస్తోన్న ప్రజాదరణ చూసి...మొత్తం ప్రభుత్వం రంగంలోకి దిగి తమ అభ్యర్థిని గెలిపించుకున్నారని టీడీపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అంతకుముందు, పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ ను కలిసినపుడు కూడా పృథ్వి వైసీపీ కి మద్దతు తెలిపిన విషయం విదితమే. వైసీపీ కండువా మెడలో వేసుకొని....వైసీపీ జెండా భుజాన మోస్తూ జగన్ అడుగులో అడుగేసుకుంటూ పృథ్వీ....జననేత వెంబడి నడిచారు. పేదల కష్టాలు తెలిసిన వాడే నిజమైన నాయకుడని - వైఎస్ తర్వాత జననేత జగన్ కు మాత్రమే ఈ తరహా పాదయాత్ర సాధ్యమని అన్నారు. కృష్ణా జిల్లాలో కనకదుర్గమ్మ వారధి ఊగిపోయిందంటే జగన్ కు ఏ స్థాయిలో జనాదరణ వస్తోందో అర్ధమవుతోందన్నారు. తనకు తెలిసిన మహాయోధులు ఎన్టీఆర్ - వైఎస్ ఆర్ మాత్రమేనని - తాను చూసిన గొప్ప ముఖ్యమంత్రులు వారిద్దరేనని అన్నారు. వారి తర్వాత అంతటి ఘనత జగన్ కే సాధ్యమని ప్రశంసలతో ముంచెత్తారు.