Begin typing your search above and press return to search.

దేశానికి అంబేడ్కర్ ఇండియా అని పేరు పెట్టాలి: నటుడు ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   28 May 2022 8:30 AM GMT
దేశానికి అంబేడ్కర్ ఇండియా అని పేరు పెట్టాలి: నటుడు ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు
X
పీపుల్స్ స్టార్, నక్సల్స్ చిత్రాల స్పెషలిస్టు ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి అంబేడ్కర్ ఇండియా అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడం ఎంతైనా ముదావహం, సమంజసమని చెప్పారు. అమలాపురంలో ఇళ్లు తగులబెట్టడం, బస్సులు తగులబెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అల్లర్లకు పాల్పడటం సరికాదని నారాయణమూర్తి చెప్పారు. అంబేడ్కర్ పేరు ఒక్క జిల్లాకే కాకుండా దేశం మొత్తానికి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కోనసీమకు జిల్లాకు మహనీయుడు అంబేడ్కర్ పేరు పెట్టడం శుభపరిణామమన్నారు.

ఏపీ ప్రజా నాట్య మండలి పదో రాష్ట్ర మహా సభల్లో భాగంగా కడపలో నిర్వహించిన సభకు ఆర్.నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలైన భారత సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), పోస్టల్, రైల్వే, విమానాశ్రయాలు, పోర్టులను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నడం బాధాకరమన్నారు.

తిరుమల వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చాక మోసగించడం దారుణమని నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల నడ్డివిరిచేలా నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి వారిని రోడ్డుకు ఈడ్చటం బాధాకరమన్నారు. దేశానికే రైతే రాజని.. రైతులను బికారిని చేసే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిటీ నివేదికను ఇప్పటివరకు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.

కాగా ప్రస్తుతం వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఆర్.నారాయణమూర్తి ఉన్నారు. ఇటీవల సినిమా టికెట్ రేట్లు పెంచాలని మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రభాస్, మహేష్, రాజమౌళి తదితర హీరోలు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసినప్పుడు వారితో పాటు ఆర్.నారాయణ మూర్తి కూడా వచ్చారు.

అయితే ఆర్.నారాయణమూర్తిని చిరంజీవి బృందం సీఎం వైఎస్ జగన్ ను కలవడానికి ఆహ్వానించలేదు. తమ పార్టీ సానుభూతిపరుడు కావడంతో ఆర్.నారాయణమూర్తికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఇదే మాదిరిగా నటులు అలీ, పోసాని కృష్ణమురళిలను కూడా ఆహ్వానించింది.