Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌-ప‌వ‌న్ క‌లిసి న‌డ‌వాలని కోరుకుంటున్న సినీ హీరో

By:  Tupaki Desk   |   12 Nov 2017 4:42 PM GMT
జ‌గ‌న్‌-ప‌వ‌న్ క‌లిసి న‌డ‌వాలని కోరుకుంటున్న సినీ హీరో
X
రాజ‌కీయాల్లో భిన్న‌ధ్రువాలుగా ఉన్న వైసీపీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి - జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏక‌మ‌వుతారా? అంటే ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం అంద‌రూ ఊహించేందే. అయితే ఈ ఇద్ద‌రూ ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు సినీ హీరో శివాజీ. 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన కూటమికి మ‌ద్ద‌తిచ్చిన శివాజీ అనంత‌రం ప్ర‌త్యేక హోదా కోసం గ‌ళం విప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ, టీడీపీలు ప్ర‌త్యేక హోదాపై చేతులు ఎత్తేయ‌డంతో ఆ రెండు పార్టీల‌ను ల‌క్ష్యంగా చేసుకొని శివాజి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆంధ్రుల ఆకాంక్ష‌లు తుంగ‌లో తొక్కార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోరాటం చేస్తున్నార‌ని ప్ర‌శంసించారు. అయితే గత కొద్దికాలంగా తెరమరుగు అయిపోయిన శివాజీ తాజాగా మళ్లీ ఎంట్రీ ఇచ్చారు.

ప్రత్యేక హోదా - రాష్ట్ర విభజన సమస్యలపై కర్నూలులో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ నేత రామకృష్ణ - ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ - సినీ నటుడు శివాజీలు హాజరయ్యారు. సమావేశం అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడుతూ - ప్రత్యేక హక్కు ఎవడబ్బ సొత్తు కాదని ఏపీ ప్రజల హక్కు అని అన్నారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ప్రత్యేక హోదాను సాధించడానికి వైసీపీ అధినేత జగన్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు నడుం బిగించాలని అన్నారు.

కాగా, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే బీజేపీ నుంచి శివాజీ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అది ప‌లు కార‌ణాల వ‌ల్ల వెన‌క్కుపోయింది. కానీ ఈ ద‌పా శివాజీ పోటీ చేస్తార‌ని, అందుకు జ‌న‌సేన వేదిక కానుంద‌ని అంటున్నారు. వివిధ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం ప్ర‌కారం గుంటూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతార‌ని కూడా కొన్ని వ‌ర్గాలు జోస్యం చెప్తున్నాయి.