Begin typing your search above and press return to search.

విమ‌ర్శ చేయ‌కుండానే ప‌వ‌న్ కు శివాజీ షాక్

By:  Tupaki Desk   |   17 March 2018 6:05 AM GMT
విమ‌ర్శ చేయ‌కుండానే ప‌వ‌న్ కు శివాజీ షాక్
X
ఏపీ విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపై గొంతెత్తిన ప్ర‌ముఖుల్లో సినీ న‌టుడు శివాజీ ఒక‌రు. ప్ర‌జాభిమానం అంత‌గా లేకున్నా.. హోదాపై శివాజీ చేసిన ప్ర‌య‌త్నాల‌తో ప్ర‌జ‌లు దాని గురించి మాట్లాడేలా చేశారు. కొన్ని మీడియా సంస్థ‌ల‌తో క‌లిసి శివాజీ హోదాపై పోరాడే ప్ర‌య‌త్నం చేసినా.. ఆయ‌న‌కు ద‌న్ను పెద్ద‌గా ల‌భించింది లేదు. ఇదే స‌మ‌యంలో కొంద‌రు ఉద్య‌మ నేత‌లు శివాజీ వెంట వ‌చ్చినా.. రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు.

ఇలాంటివేళ‌లో శివాజీ ఒక‌సారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వ్య‌క్తి హోదా కోసం ఉద్య‌మ గోదాలోకి దిగితే ప‌రిస్థితి మార్పు వ‌స్తుంద‌న్నారు. కొన్నేళ్లు హోదా కోసం ప్ర‌య‌త్నాలు చేసి.. ఆ త‌ర్వాత విదేశాల‌కు వెళ్లిపోయిన ఆయ‌న ఇటీవ‌ల తిరిగి వ‌చ్చారు. ఇదిలా ఉంటే.. హోదా అంశంపై ఏపీలో ఈ రోజు సాగుతున్న చ‌ర్చ అంతా ఇంతా కాదు.
దేశ రాజ‌కీయాల్ని సైతం హోదా అంశం ప్ర‌భావితం చేస్తోంది. ఇలాంటివేళ శివాజీ గళం విప్పారు. హోదాపై మాట్లాడాల్సిన ప‌వ‌న్‌.. అవినీతి మీద మాట్లాడ‌టం ఏమిటంటూ సందేహాన్ని వ్య‌క్తం చేశారు. అవినీతి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న‌దేన‌న్న ఆయ‌న‌.. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ సంద్భంగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు స‌రిగా లేవ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. టీడీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ వ్యాఖ్య‌లు స‌రికాద‌న్న వాద‌న‌ను వినిపించ‌టం గ‌మ‌నార్హం.

బాబు స‌ర్కారు అవినీతి కంటే..ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న శివాజీ.. అన్ని రాజ‌కీయ పార్టీలు ఏదో ఒక రీతిలో అవినీతికి పాల్ప‌డుతూనే ఉంటాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. అవినీతి గురించిన చ‌ర్చ ఇప్పుడు అన‌వ‌స‌ర‌మ‌న్న శివాజీ.. ఎవ‌రు అవినీతిప‌రులు కాదు? అంటూ సూటిగా ప్ర‌శ్న సంధించారు.
ఎవ‌రైనా ఏదైనా భూమి కొన్న‌ప్పుడు దాని మార్కెట్ వాల్యూ కంటే త‌క్కువ చేసి చూపించ‌టం చేస్తార‌ని.. తాను కూడా అలానే చేసిన‌ట్లు చెప్పారు.

శివాజీ నోట ఈ మాట వ‌చ్చినంత‌నే.. ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూ చేసిన వ్య‌క్తి చ‌టుక్కున స్పందించి.. కాజా ద‌గ్గ‌ర ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల కొనుగోలు చేసిన రెండు ఎక‌రాల భూమి గురించి ప్ర‌స్తావించారు. ప‌వ‌న్ కొన్న భూమి ద‌గ్గ‌ర ఎక‌రం రూ.3 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంద‌ని.. అయితే.. ప‌వ‌న్ ఎక‌రం రూ.40ల‌క్ష‌ల‌కు కొన్న‌ట్లుగా ప‌త్రాలు బ‌య‌ట‌కు రావటాన్ని ప్ర‌స్తావించారు. ప‌వ‌న్ భూమికొనుగోలు ధ‌ర‌పై సంధించిన ప్ర‌శ్న‌ను దాట‌వేస్తూ.. తానీ విష‌యంలో మ‌రింత లోతుల్లోకి వెళ్ల‌లేనంటూనే.. ప్ర‌తిఒక్క‌రూ ఎంతోకొంత అవినీతిప‌రులే.. మ‌రీ లోతుల్లోకి వెళ్ల‌టం స‌రికాద‌ని తేల్చేశారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్రంలోని వారంతా ప్ర‌త్యేక హోదా కోసం పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కేంద్రం నుంచి ఏపీకి ద‌క్కాల్సిన న్యాయ‌మైన డిమాండ్ సాధ‌న కోసం కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఒక‌సారి ప్ర‌త్యేక హోదాను రాష్ట్రానికి సాధిస్తే.. మిగిలిన డిమాండ్లు.. స‌మ‌స్య‌ల‌న్నీ ఒక్కొక్క‌టిగా ప‌రిష్కార‌మ‌వుతాయ‌న్న మాట‌ను చెప్పారు. కొన్ని అంశాల మీద శివాజీ రియాక్ట్ అయిన తీరు చూస్తే.. ప‌వ‌న్ తో పోలిస్తే ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో ఆయ‌న‌కే క్లారిటీ ఉంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.