Begin typing your search above and press return to search.

బాబు కోసం రాలేదు..ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం వ‌చ్చా

By:  Tupaki Desk   |   26 Jun 2018 11:01 AM GMT
బాబు కోసం రాలేదు..ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం వ‌చ్చా
X
విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం గ‌ళం విప్పిన సినీ సెల‌బ్రిటీల్లో శివాజీ ముందుంటారు. విభ‌జ‌న నాటి నుంచి త‌న ఫీలింగ్స్ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఓపెన్ గా మాట్లాడిన ఆయ‌న‌.. ఒక‌ద‌శ‌లో ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం వీధుల్లోకి వ‌చ్చి పోరాటం చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. హోదా సాధ‌న కోసం దీక్ష చేసిన ఆయ‌న‌.. త‌ర్వాతి కాలంలో కాస్త కామ్ అయ్యారు.

ఇటీవ‌ల ఫారిన్ నుంచి వ‌చ్చిన శివాజీ.. ఏపీ హోదా అంశంపైనా.. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యాల్లోనూ రియాక్ట్ అవుతుంటారు. ఇదిలా ఉండ‌గా.. క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మాగారం కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న దీక్షకు సంఘీభావాన్ని తెలిపిన శివాజీ మాట్లాడారు. ఏపీ హ‌క్కుల సాధ‌న కోసం పార్టీల‌కు అతీతంగా అంద‌రూ క‌లిసి పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా చాలా అవ‌స‌ర‌మ‌న్నారు.

ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తుంద‌ని తాను నాలుగేళ్లుగా మొత్తుకుంటూనే ఉన్నాన‌ని.. వెనుక‌బ‌డిన ఉత్త‌రాంధ్ర‌.. రాయ‌ల‌సీమ ప్రాంతాల్ని ఆదుకోవాల్సింది పోయి బీజేపీ నేత‌లు రాజ‌కీయం చేస్తున్నార‌న్నారు. క‌డ‌ప‌కు ఉక్కు క‌ర్మాగారం రాకుండా బీజేపీ నేత‌లు అడ్డుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.

రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ తో ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాల్ని బీజేపీ చేస్తుంద‌న్నారు. కేంద్రంతో అంట‌కాగే వారిని తొక్కేయాల‌న్న పిలుపునిచ్చిన శివాజీ.. కొన్ని పార్టీలు త‌మ రాజ‌కీయాల కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల్ని తాక‌ట్టు పెడుతున్నాయ‌ని త‌ప్పు ప‌ట్టారు.

తిరుమ‌ల ఆల‌యాన్ని రాష్ట్రం నుంచి వేరే చేసే దుర్మార్గ‌పు య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు మండిప‌డ్డారు.ఎన్నో ఏళ్లుగా తిరుమ‌ల శ్రీ‌వారికి సేవ చేసిన ర‌మ‌ణ‌దీక్షితులు త‌న ప‌ద‌వి పోగానే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రికాద‌న్నారు. ఆయ‌న్ను ఎవ‌రూ తొల‌గించ‌లేద‌ని.. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామే ఆయ‌న‌కు విశ్రాంతి క‌ల్పించిన‌ట్లుగా వ్యాఖ్యానించారు. ప‌ద‌వి పోయాక విమ‌ర్శ‌ల‌కు దిగ‌కుండా.. శ్రీ‌వారి మ‌హిమ‌ల గురించి భ‌క్త‌కోటికి వివ‌రించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి ఉంటే.. ర‌మ‌ణ‌దీక్షితుల్ని ప్ర‌జ‌లు దేవుడి మాదిరి కొలిచేవార‌న్నారు. తాను వ‌చ్చింది టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు కాద‌ని.. ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకే వ‌చ్చిన‌ట్లు చెప్పారు. రాష్ట్ర హ‌క్కుల కోసం కేంద్రంతో పోరాడుతున్న రాష్ట్ర ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.