Begin typing your search above and press return to search.

శివాజీ మాట‌!..సాయంత్రం బ‌ద్ద‌లైపోతుందంతే!

By:  Tupaki Desk   |   22 March 2018 8:11 AM GMT
శివాజీ మాట‌!..సాయంత్రం బ‌ద్ద‌లైపోతుందంతే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఓ రేంజిలో పోరాటం చేసిన వ్య‌క్తుల్లో టాలీవుడ్ హీరో శివాజీ పేరే ముందు ఉంటుంది. ఎందుకంటే... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కొన‌సాగించిన పోరు కంటే ముందు తాను బీజేపీలో ఉన్నా... కేవ‌లం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేద‌న్న ఒకే ఒక్క కార‌ణంతో ఆయ‌న ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇత‌ర వ‌ర్గాలేవీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌కున్నా... కొద్ది మంది అనుచ‌రుల‌తో ఆయ‌న ఏకంగా ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. ఆ త‌ర్వాత పోలీసులు ఆయ‌న దీక్ష‌ను భ‌గ్నం చేశార‌నుకోండి. అయినా కూడా ఏమాత్రం వెనుకంజ వేయ‌ని శివాజీ... త‌న మ‌దిలో మెదిలిన అన్ని ర‌కాల ఆందోళ‌న‌లు చేసి... ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌ని చెప్పేశారు. మొత్తంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఆది నుంచి త‌న స్టాండ్ ను వీడ‌కుండా పోరాడుతున్న పార్టీగా వైసీపీ క‌నిపిస్తుండ‌గా... ప్ర‌జా సంఘాలు - వ్య‌క్తుల పోరు ప‌రంగా చూసుకుంటే ఆ త‌ర‌హా పోరు సాగించింది ఒక్క శివాజీ మాత్ర‌మేన‌ని చెప్పాలి.

ఇత‌ర ప‌క్షాలు కూడా ఈ త‌ర‌హా పోరు సాగించినా... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం శివాజీ ఏకంగా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును ప్ర‌శ్నార్థ‌కం చేసుకున్నారు. అయినా ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకంటారా? ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇప్పుడు ఉవ్వెత్తున సాగుతున్న ఉద్య‌మంలోకి శివాజీ మ‌ళ్లీ దిగిపోయాడు. కొన్ని ప్ర‌జా సంఘాల‌తో క‌లిసి ఆయ‌న త‌న‌దైన శైలి పోరాటాన్ని ప్రారంభించేశారు. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం ఏపీలోని అన్ని రాజ‌కీయ పార్టీలు పిలుపునిచ్చిన ర‌హ‌దారుల దిగ్బంధంలో పాలుపంచుకున్న సంద‌ర్భంగా శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు సాయంత్రం తాను ఓ సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌బోతున్నాన‌ని - ఆ విష‌యం మొత్తం పోరాటాన్ని మరింత‌గా ఉధృతం చేస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. శివాజీ నోట నుంచి ఈ మాట విన్నంతనే ఇప్పుడే ఆ విష‌యాన్ని చెప్పండన్న మీడియా ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన శివాజీ... త‌న‌కు సెక్యూరిటీ వ‌చ్చిన త‌ర్వాతే - సాయంత్ర‌మే ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు.

అయితే తాను బ‌య‌ట‌పెట్టే విష‌యం... ఏ ఒక్క రాజ‌కీయ పార్టీని టార్గెట్ చేసిన‌ట్టు ఉండ‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబును గానీ - వైసీపీ అధినేత జ‌గ‌న్‌ ను గానీ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను గానీ తాను టార్గెట్ చేయ‌బోవ‌డం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తెలుగు వారైనందున‌నే వారిని తాను టార్గెట్ చేయ‌డం లేద‌ని కూడా శివాజీ చెప్పుకొచ్చారు. ఈ మాటల ద్వారా త‌న టార్గెట్ కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీనేన‌ని - అంతేకాకుండా తాను నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల‌నే టార్గెట్ చేయ‌బోతున్నాన‌ని శివాజీ ప‌రోక్షంగా చెప్పిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.