Begin typing your search above and press return to search.

ఆ న‌టిని ముంబ‌యి పోలీసులు బ్లాక్ చేశార‌ట‌!

By:  Tupaki Desk   |   12 July 2019 7:52 AM GMT
ఆ న‌టిని ముంబ‌యి పోలీసులు బ్లాక్ చేశార‌ట‌!
X
ఊహించ‌నిరీతిలో ఒక వివాదంలో చిక్కుకున్నారు ముంబ‌యి పోలీసులు. బాలీవుడ్ న‌టి పాయ‌ల్ రోహ‌త్గి ట్విట్ట‌ర్ ఖాతాను త‌మదైన ముంబ‌యి పోలీసు ట్విట్ట‌ర్ ఖాతాలో బ్లాక్ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. ర‌చ్చ ర‌చ్చ చేసింద‌ని చెప్పాలి. ఆమె చేసిన ప‌నితో చివ‌ర‌కు ముంబ‌యి పోలీసులు దిగి వ‌చ్చి త‌మ త‌ప్పున‌కు చెంప‌లేసుకున్న ప‌రిస్థితి.

హిందుత్వ‌కు సంబంధించిన కొన్ని పోస్టుల‌ను పాయ‌ల్ పోస్ట్ చేస్తుంటారు. దీంతో.. ఆమె ట్విట్ట‌ర్ ఖాతానుముంబ‌యి పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో ఆమె తీవ్రంగా స్పందించారు. భారీ పోస్ట్ ఒక‌టి పెట్టారు. ముంబ‌యి పోలీసులు త‌న‌ను ఎందుకు బ్లాక్ చేశారు? అన్న ప్ర‌శ్న‌తో పాటు.. నేను ఏమైనా డ్ర‌గ్ కేసులో జైలుకు వెళ్లానా?.. అంటూ క్వ‌శ్చ‌న్ చేశారు. అంతేకాదు.. మైనార్టీ ట్యాగ్ వేసుకున్న న‌టుడికి మీరు బెస్ట్ ఫ్రెండా? పోలీసులే ఇలా ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తే ఎలా? అంటూ సందేహాన్ని వ్య‌క్తం చేసిన ఆమె.. ఒక తీవ్ర వ్యాఖ్య చేశారు.

హిందుస్థాన్ లో బ‌త‌కాలంటే ఒక హిందువుగా భ‌యంగా ఉంద‌ని.. హిందువుల కోసం వారి గురించి మాట్లాడొద్ద‌ని త‌న కుటుంబ స‌భ్యులు ప‌దే ప‌దే ఎందుకు చెబుతారో త‌న‌కు ఇప్పుడే అర్థ‌మైంద‌న్నారు. ముంబ‌యి పోలీసుల‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన ఆమె ప‌నిలో ప‌నిగా.. అదే మెసేజ్ ను ప్ర‌ధాని మోడీకి.. హోంమంత్రి కార్యాల‌యానికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ సంధించారు.

ఆమె చేసిన పోస్టుతో ముంబ‌యి పోలీసుల మీద పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒకరి ఖాతాను బ్లాక్ చేయ‌టం ఏమిటి? అది కూడా స‌రైన కార‌ణం లేకుండానే? అంటూ ప్ర‌శ్న‌ల‌తో పాటు.. పెద్ద ఎత్తున తిట్ల దండ‌కాన్ని మొద‌లెట్టారు. అంద‌రూ పాయ‌ల్ పోస్టుకు అండ‌గా నిలిచారు. అదే స‌మ‌యంలో ముంబ‌యి పోలీసుల తీరును త‌ప్పు ప‌ట్టారు. ఇలాంటి వారిలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌తీమ‌ణి అమృత ఫ‌డ్న‌వీస్ కూడా ఉన్నారు.

త‌మ భావాల్ని పంచుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రికి స్వేచ్ఛ ఉంటుంద‌ని.. ప్ర‌భుత్వంలో భాగ‌మైన ప్ర‌భుత్వ సంస్థ‌లు సామాన్య ప్ర‌జ‌ల ప‌ట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటి? అని ఆమె ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో పై నుంచి కూడా ఒత్తిళ్లు అంత‌కంత‌కూ పెరిగిపోయాయి. సోష‌ల్ మీడియాలో పాయ‌ల్ కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌తో ముంబ‌యి పోలీసులు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారు.

దీంతో ముంబ‌యి పోలీసులు వెన‌క్కి త‌గ్గారు. పాయ‌ల్ ట్విట్ట‌ర్ ఖాతాకు పెట్టిన బ్లాక్ ను తీసేశారు. అంతేకాదు.. ఒక పోస్టులో జ‌రిగిన దానికి సారీ చెప్పారు. మేడ‌మ్.. ముంబ‌యి పోలీసులు పౌరులకు ఎల్ల‌ప్పుడు అండ‌గా ఉంటార‌ని.. మీరు మాతో ఎప్పుడూ కాంటాక్ట్ లో ఉండొచ్చ‌ని.. ముంబైక‌ర్ ల‌ను తామెప్పుడు నిషేధించ‌లేదంటూ డ్యామేజ్ కంట్రోల్ చ‌ర్య‌ల‌కు దిగారు. పాయ‌ల్ కు ఎదురైన అసౌక‌ర్యానికి చింతిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఆమెను బ్లాక్ చేసిన కార‌ణంపై త‌మ సాంకేతిక బృందం త‌నిఖీ చేస్తుంద‌ని పేర్కొన‌టం ద్వారా.. ముంబ‌యి పోలీసులు ఒక వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని చెప్పాలి.