Begin typing your search above and press return to search.

ఆ సినీన‌టి బీజేపీలో చేరలేద‌ట‌

By:  Tupaki Desk   |   7 Jun 2018 4:11 AM GMT
ఆ సినీన‌టి బీజేపీలో చేరలేద‌ట‌
X
ద‌క్షిణాదిలో పార్టీ విస్త‌ర‌ణ కాంక్ష‌తో పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న బీజేపీ నేత‌ల ఎత్తుగ‌డ‌లు కాస్త‌...కొంద‌రు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌కు - పైగా రాజ‌కీయాల‌తో సంబంధం లేని వారికి ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. త‌మ ప్ర‌చార ప‌ర్వాన్ని కొన‌సాగించే క్ర‌మంలో బీజేపీ నేత‌లు చేసిన ప‌నికి ఓ సినీన‌టి ఇబ్బందిప‌డ్డారు. ఏకంగా తాను బీజేపీలో చేర‌లేదు బాబోయ్ అంటూ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రంటే...ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ తనయురాలు - సినీ నటి వరలక్ష్మి.

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ సార‌థ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌’ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా నుంచి మొద‌లుకొని ముఖ్య‌నేత‌ల వ‌ర‌కు వివిధ రాష్ర్టాల్లో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు త‌మిళ‌నాడులో బుధవారం వరలక్ష్మిని కలిసి మోడీ ప్రభుత్వ విజయాలను ఆమెకు వివరించారు. ఇంకేముంది...ఈ వార్త మీడియాలో వైర‌ల్ అయింది. బీజేపీలో చేరిందని కొన్ని మీడియాలు కథనాలు రాశాయి. వరలక్ష్మి తండ్రి - గతంలో ఆలిండియా మక్కల్‌ సమథువ కచ్చి పార్టీని స్థాపించిన‌ ప్రముఖ నటుడు శరత్‌ కుమార్ అంగీకారం మేర‌కే ఈ ప‌రిణామం చోటుచేసుకుంద‌ని ప‌లువురు ప్ర‌చారం సాగింది. ఈ ప్ర‌చారంతో అవాక్క‌వ‌డం వ‌ర‌ల‌క్ష్మి వంతు అయింది.

తాను బీజేపీలో చేరిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో వ‌ర‌ల‌క్ష్మి మీడియా ముందుకు రాక‌ త‌ప్ప‌లేదు. తాను బీజేపీలో చేరలేదని ఆమె వివరణ ఇచ్చారు. బీజేపీ నేత‌లు త‌న‌ను క‌లిసింది నిజ‌మేన‌ని పేర్కొంటూ మోడీ ప్రభుత్వ విజయాల గురించి తెలుసుకునేందుకే తాను బీజేపీ నేతలను కలిశానని వెల్ల‌డించారు. దేశ ప్రగతి - మహిళల భద్రత - ప‌లు సంక్షేమ‌ - అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు - చేసిన కృషిని వివరించారని - అవి త‌న‌కు సంతృప్తి క‌లిగించాయ‌ని పేర్కొంటూ...త‌మ మ‌ధ్య‌ రాజ‌కీయాల‌కు సంబంధించిన చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌న్నారు.