Begin typing your search above and press return to search.

అంబానీ, అదానీ ఇద్దరి టార్గెట్ ఒక్కటే?

By:  Tupaki Desk   |   27 Jun 2021 3:30 AM GMT
అంబానీ, అదానీ ఇద్దరి టార్గెట్ ఒక్కటే?
X
దేశంలోనే అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఇక ఆయనను బీట్ చేసేలా దూసుకొస్తున్న మరో గుజరాతీ వ్యాపారవేత్త గౌతం అదానీ. ఈ ఇద్దరు గుజరాతీలు దేశ వ్యాపారరంగాన్ని అన్ని రంగాల్లో దున్నేస్తున్నారు. ఆసియాలోనే కుబేరులుగా ఎదిగారు. గుజరాత్ కే చెందిన మోడీ దేశంలో అధికారంలో ఉండడం.. వీరితో సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉండడంతో వీరి వ్యాపారాలు ఆశాజనకంగా దూసుకెళ్తున్నాయని చెబుతున్నారు.

అయితే ఇప్పుడు ఇద్దరూ రాబోయే తరానికి అత్యవసరంగా కీలకంగా మారబోతున్న ‘గ్రీన్ ఎనర్జీ’పై పడ్డారు. ఇద్దరి ఫోకస్ ఇప్పుడు అదేనట.. ఈ సంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేయడంలో ఒకరిని మించి ఒకరు పెట్టుబడి పెడుతూ లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ భారీగా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ ఇద్దరు గుజరాతీ వ్యాపారులు ఇప్పటిదాకా ఒకరి వ్యాపారంలో మరొకరు వేలు పెట్టలేదు. ఎవరి వ్యాపారాలు వారు బుద్దిగా చేసుకున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెట్రో రిఫైనరీలు, టెలికాం, రిటైల్ తదితర రంగాల్లో ఉంటే.. గౌతం అదానీ మాత్రం పోర్టులు, సరుకుల రవాణా, మెగా ప్రాజెక్టులు, మౌళిక సదుపాయాల రంగంలో వ్యాపారం చేశారు. ఇద్దరి దారులు వేరు కావడంతో క్లాష్ కాలేదు.

తాజాగా గౌతం అదానీ గ్రీన్ ఎనర్జీపైన ఫోకస్ పెట్టారు. 2030 నాటికి సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న వివిధకంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. నిధుల సమీకరణ చేస్తున్నారు. తాజాగా అదానీ గ్రీన్ ఎనర్జీలో ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థకు 20శాతం వాటాను ఇచ్చి బలోపేతం చేస్తున్నారు.

ఇక టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం ఇతర రంగాలకు విస్తరించాలని ముఖేష్ అంబానీ నిర్ణయించారు. గ్రీన్ ఎనర్జీలో మార్పులు తెస్తామంటూ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ క్రమంలోనే గ్రీన్ ఎనర్జీపై 75000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించారు. మూడేళ్లలోనే 100 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా సాగుతున్నారు.

ప్రస్తుతం దేశంలోనే సంపన్నులు అంబానీ, అదానీ. ఇద్దరూ ఎప్పుడూ మార్కెట్ ను పసిగడుతూ వ్యాపారాలను విస్తరించి విజయాలు సాధించారు.ఇప్పుడు పరస్పరం పోటీపడుతున్నారు. నంబర్ 1 ర్యాంకు లక్ష్యంగా సాగుతున్న వీరి వ్యాపార ఫైట్ ఎటు దారితీస్తుందో చూడాలి.