Begin typing your search above and press return to search.

అదానీ చేతికి ముంబై ఎయిర్ పోర్టు .. కీలక ప్రకటన !

By:  Tupaki Desk   |   14 July 2021 5:36 AM GMT
అదానీ చేతికి ముంబై ఎయిర్ పోర్టు .. కీలక ప్రకటన !
X
ఎట్టకేలకు ముంబై ఎయిర్ పోర్టులో అదానీ గ్రూప్ ల్యాండ్ అయింది. ముంబై ఎయిర్ పోర్టు, నవీ ముంబై ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ కంట్రోల్ ను అదానీ గ్రూప్ టేకోవర్ చేసింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను జీవీకే గ్రూప్ నుంచి బదిలీ చేసుకున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ ఎయిర్పోర్టులో జీవీకే గ్రూప్ కు ఉన్న 50.5శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు గతేడాది ఆగస్టులోనే అదానీ వెల్లడించింది. దీంతో పాటు మైనారిటీ భాగస్వాముల నుంచి 23.5 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు తెలిపింది.

మంగళవారం నిర్వహించిన బోర్డు మీటింగ్ లో నిర్వహణ బాధ్యతలను స్వీకరించినట్లు అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వెల్లడించింది. అంతకుముందు, సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయంపై ట్వీట్ చేసి తెలిపారు. జీవీకే.. జీఎంఆర్. దేశంలో కొత్త తరం విమానాశ్రయాల అభివృద్ధిలో వీరి పాత్ర మామూలుది కాదు. కానీ ఇప్పుడు వీరు విమాశ్రయాలను వేరేరే వారికి అప్పగించాల్సి వస్తోంది. తాజాగా జీవీకే అభివృద్ధి చేసిన ముంబై విమానాశ్రయం… అదానీకి అప్పగించాల్సి వచ్చింది. ప్రపంచస్థాయి ఎయిర్ పోర్టు అదానీ గ్రూపు చేతికి రావడం ఆనందంగా ఉందని అదానీ సంతోషంగా ట్వీట్ చేశారు.

భారత్ ఆర్థిక రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, అభివృద్ధి కాంట్రాక్టు తెలుగు వారైన జీవీ కృష్ణా రెడ్డికి చెందిన జీవీకే గ్రూపునకు దక్కగా, ఆ మధ్య మేనేజ్మెంట్ మార్పునకు సంబంధించిన ఒప్పందాలు కుదరడంతో ఇప్పుడా ఎయిర్ పోర్టు అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది.

ప్రపంచస్థాయి ఎయిర్ పోర్టు అదానీ గ్రూపు చేతికి రావడం ఆనందంగా ఉందని, ఈ ప్రక్రియలో స్థానికులు వేలాది మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించబోతున్నామని, పోర్టును మరింతగా విస్తరించేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని గౌతమ్ అదానీ తెలిపారు. ముంబయి ఎయిర్ పోర్ట్ పూర్తిగా అదానీ చేతికి వచ్చేందుకు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర సిటీ, ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(సిడ్కో) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.

దిల్లీ తర్వాత అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం ముంబయిదే. ప్యాసింజర్లతో పాటు కార్గో ట్రాఫిక్ ఇక్కడ అధికంగా ఉంటుంది. కాగా, మొత్తం ఎనిమిది ఎయిర్పోర్టులను తన అధీనంలో ఉంచుకొని దేశంలో అతిపెద్ద ఎయిర్ పోర్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా కొనసాగుతోంది అదానీ గ్రూప్. మొత్తం 25 శాతం రవాణా ఈ ఎయిర్ పోర్టుల గుండా జరుగుతోంది. ముంబయి విమానాశ్రయంతో కలిపితే 33 శాతం కార్గో ట్రాఫిక్ అదానీ గ్రూప్ లోని ఎయిర్ పోర్టుల ద్వారానే జరుగుతుంది.

వచ్చే మూడేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద మూడో సివిల్ ఏవియేషన్ మార్కెట్ గా భారత్ అవతరించబోతున్నదని, ఏవియేషన్ రంగంలో అవకాశాలను అదానీ గ్రూపు అందిపుచ్చుకుంటుందని, 2024 నాటికి నవీ ముంబై గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ఇప్పటికే జైపూర్, కొచ్చి, తిరువనంతపురం, గువాహటి సహా 6 ఎయిర్ పోర్టుల నిర్వహణకు ఒప్పందం చేసుకున్న విషయాన్ని అదానీ గుర్తుచేశారు.