Begin typing your search above and press return to search.

‘హింస’ అంతా ప్లాన్ ప్రకారమేనంట

By:  Tupaki Desk   |   2 Feb 2016 1:01 AM GMT
‘హింస’ అంతా ప్లాన్ ప్రకారమేనంట
X
తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ఆదివారం నిర్వహించిన ‘‘కాపు ఐక్య గర్జన’’ ఉదంతం మొత్తం ప్లాన్ ప్రకారమే జరిగిందని చెబుతున్నారు అడిషనల్ ఐజీ ఠాకూర్. కాపుగర్జన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన మాట్లాడారు. తుని ఘటనలో పోలీసులు అత్యంత సంయమనం పాటించారని.. నిఘా వైఫల్యం అస్సలు లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. తునిలో చోటు చేసుకున్న హింస మొత్తం పక్కా ప్లాన్ తోజరిగిందన్న సందేహాలు వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఐదువేల మంది సీఆర్ పీఎఫ్.. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల్ని మొహరించినట్లు చెప్పిన ఠాకూర్.. ప్రాణాలకు లెక్క చేయకుండా పోలీసులు.. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల్ని పోలీసులు కాపాడినట్లు పేర్కొన్నారు. పోలీసులే లేకుండా.. ప్రాణ నష్టం జరిగేదని ఆయన చెప్పుకున్నారు. తుని ఘటనలో పోలీసులు ఎన్నడూ లేనంత సంయమనం పాటించారనటంలో ఎలాంటి సందేహమే లేదు. కానీ.. నిఘా వైఫల్యం లేదని చెప్పటం మాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాక్ష్యాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే నిఘా వైఫల్యమని తేల్చిన తర్వాత.. ఠాకూర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యానించటం ఏమిటో? నిజంగానే నిఘా వర్గాల దగ్గర ఇంత భారీ విధ్వంసం జరుగుతుందన్న సమాచారం ఉంటే.. దాన్ని అడ్డుకోవటానికి పోలీసులు ఏం చేశారు? ఆ లెక్కన చూసినా పోలీసులు వైఫల్యం చెందినట్లే కదా?