Begin typing your search above and press return to search.

తలా తోకా లేకుండా ‘ఆది’ కౌంటర్లు!

By:  Tupaki Desk   |   19 Feb 2018 12:57 PM GMT
తలా తోకా లేకుండా ‘ఆది’ కౌంటర్లు!
X
‘ఆది’ సినిమా గుర్తుందా? ‘‘తల్లి తోడు అడ్డంగా నరుకుతా’’ సూపర్ హిట్ డైలాగు.. తాజా రాజకీయాల్లో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆ డైలాగును చెప్పడం లేదు తప్ప.. అంతకంటె ఎక్కువ సంచలనాలనే నమోదు చేస్తున్నారు. కాకపోతే.. అడ్డంగా నరకడానికంటె ఎక్కువగా తెలుగుదేశానికి నష్టం జరిగేలాగా ఆయన వ్యవహరిస్తుండడమే తమాషా! మొన్నటికి మొన్న ప్రభుత్వం నుంచి తప్పుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నాం అంటూ.. తమ కేంద్ర మంత్రులు రాజీనామా చేసేస్తారంటూ ప్రకటించి.. అంతలోనే ఆయన నాలిక్కరుచుకున్న వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా అంతకంటె ఎక్కువగా తలా తోకా లేకుండా ఆయన ప్రకటనలు గుప్పిస్తున్నారు.

పవన్ కల్యాణ్ చెప్పిన ప్రతిపాదనను ఆమోదిస్తూ.. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధమేనని , అందుకు తెదేపా కూడా కలిసి వస్తుందా? అని జగన్ ప్రశ్నించారు. అయితే ఆది మాత్రం జగన్ కు ఆ మాత్రం రాజకీయాలు తెలియదా? మేం ఎన్డీయేలో భాగస్వాములం అవిశ్వాసం ఎలా పెడతాం అని ఆది అంటున్నారు. అదే సమయంలో తాము మార్చి 5 వరకు కేంద్రానికి గడువు ఇచ్చాం అని ఆ డెడ్ లైన్ లోగా ఏపీకి చేసే సాయం సంగతి తేల్చకుంటే.. తాము ప్రభుత్వం నుంచి తప్పుకుంటాం అని కూడా సెలవిస్తున్నారు.

అయితే ఆదినారాయణ రెడ్డి గారూ.. జగన్మోహన్ రెడ్డి అవశ్వాస తీర్మానం పెడతాం అంటున్నది మార్చి చివరి వారంలో.. ఆలోగా మీరు అసలు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నప్పటి సంగతి కదా అని ప్రజలు నవ్వుకుంటున్నారు. మార్చి 5 నాటికి తెదేపా బంధం తెగిపోవడం అంటూ జరిగితే.. మార్చి నెలాఖరుకు ఖాళీగా కేవలం ప్రతిపక్ష పాత్రలోనే ఉంటారు కదా.. మరి అప్పుడు జగన్ తో కలిసి అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉంటారా? అనే ప్రశ్న కూడా ప్రజల్లో వినవస్తోంది.

ప్రత్యేకహోదా విషయంలో మాత్రం ఇంకా తెదేపా అదే బుకాయంపునకు పాల్పడుతోంది. అది ఓ కల.. సాధ్యం కాదు.. అందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నాం వంటి వంచనతో నిండిన మాటలనే ఇప్పటికీ మంత్రి ఆది అంటుండడం విశేషం. ఈ విషయంలో ప్రజల్లో ఉండే ఆశను కూడా సమూలంగా తుడిచిపెట్టేయడానికే తెదేపా శ్రేణులు - నేతలు తెగిస్తున్నట్లు అర్థమవుతోంది.

అయితే మార్చి 5 లోగా ఏ సంగతి తేలకుంటే.. కేంద్రానికి జనగణమన పాడుతామని ప్రకటిస్తున్న ఆది నారాయణ రెడ్డి.. ఈ విషయంలో తెదేపా మళ్లీ మాటతప్పితే గనుక.. ప్రజలే వారికి జనగణమన పాడేస్తారనే సత్యాన్ని గ్రహించాలి.