Begin typing your search above and press return to search.

కొత్త మంత్రి నోట బొత్స మాట

By:  Tupaki Desk   |   14 April 2022 1:34 PM GMT
కొత్త మంత్రి నోట బొత్స మాట
X
ఆయన కొత్త మంత్రి అంటే కాదు కానీ కొత్త శాఖకు మంత్రి. ఆయన పేరు ఆదిమూలపు సురేష్. జగన్ మలివిడత మంత్రివర్గ విస్తరణలో ఆయన లాస్ట్ మినిట్ లో చోటు సంపాదించారు. అంతే కాదు అత్యంత కీలకమైన శాఖలను కూడా దక్కించుకున్నారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా ఆయనకు జగన్ సూపర్ చాన్స్ ఇచ్చారు. తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టిన సురేష్ ఫస్ట్ డైలాగే మరో మంత్రి బొత్స సత్యనారాయణకు డిటో అన్నట్లుగా చెప్పేశారు.

అధికార వికేంద్రీకరణే మా లక్ష్యం అంటూ సురేష్ మీడియాకు చెప్పడం విశేషం. నిన్నటిదాకా ఈ శాఖను చూసిన బొత్స ఈ మాటే తరచూ అంటూండేవారు. మూడు రాజధానులు ఎలా చేసి చూపిస్తామో చూస్తూండండి అని బొత్స మీడియాను ఎపుడూ సస్పెన్స్ లో పెట్టేవారు. బొత్స అయిదేళ్ళూ తాను ఈ శాఖను చూస్తాను అనుకుని ఉంటారు. అందుకే ఈ మధ్య హై కోర్టు తీర్పు వచ్చాక కూడా ఇదే తీరున ఆయన మాట్లాడారు.

ఇపుడు చూస్తే ఆయన విద్యా శాఖను చూస్తున్నారు. ఆయన ప్లేస్ లోకి వచ్చిన సురేష్ ఇపుడు రాజధానుల మీద మాట్లాడాల్సి వస్తోంది. అందుకే ఆయన తొలి పలుకుగానే బొత్స మాట్లాడిన మాటలను ఎంచుకున్నారు. మూడు రాజధానులే మా విధానం అధికార వికేంద్రీకరణకే మేము కట్టుబడి ఉన్నామని కూడా గట్టిగా చెబుతున్నారు.

అంటే సురేష్ పురపాలన ప్రస్థానం బొత్స పలుకుతో మొదలైంది అన్న మాట. ఇదే తీరున ఆయన ముందు ముందు ఈ మాటను వందల వేల సార్లు తన పదవీ కాలం లో వల్లె వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మూడు రాజధానుల విషయం న్యాయపరమైన వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు. హై కోర్టు తీర్పు మీద అప్పీల్ చేసి అంతా సానుకూలం అయితేనే అది సాకారం అయ్యేది. సో అప్పటిదాకా బొత్స డైలాగులను సురేష్ ఎంత బాగా బట్టీ పడితే అంతలా ఆయన శాఖను సమర్ధంగా నిర్వహించవచ్చు అని సెటైర్లు పడుతున్నాయి.