Begin typing your search above and press return to search.

ఏపీ విద్యామంత్రి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌..3 ఫైల్స్ పై సంత‌కం!

By:  Tupaki Desk   |   20 Jun 2019 9:02 AM GMT
ఏపీ విద్యామంత్రి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌..3 ఫైల్స్ పై సంత‌కం!
X
న‌మ్మ‌కాలు.. ముహుర్తాలు.. వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల కార‌ణంగా జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలోని మంత్రులు ఎవ‌రికి వారుగా త‌మ శాఖ‌ల బాధ్య‌త స్వీక‌ర‌ణ వేర్వేరుగా చేప‌డుతున్నారు. ఈ రోజున ఏపీ విద్యాశాఖ‌మంత్రిగా ఆదిమూల‌పు సురేష్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో విద్య‌కు భారీగా ప్రాధాన్య‌త ఇవ్వ‌టం.. న‌వ‌ర‌త్నాల్లో ముఖ్య‌మైన అమ్మ ఒడి కార్య‌క్ర‌మం ఆయ‌న ప‌రిధిలోకి రానున్న నేప‌థ్యంలో.. ఆయ‌నపై బాధ్య‌త ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పాలి.

దీనికి తోడు ఏపీలో విద్యను శాసించే కార్పొరేట్ విద్యాసంస్థ‌ల‌కు ముకుతాడు వేయ‌టం.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌క‌కు.. కాలేజీల‌కు పేరు ప్ర‌ఖ్యాతులు తేవాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పై ఉంది. దీనికి తోడు.. విద్య‌పై జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారించ‌ట‌మే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల రూపురేఖ‌ల్ని మార్చేస్తాన‌ని సీఎం హోదాలో జ‌గ‌న్ చెప్ప‌టాన్ని మ‌ర్చిపోలేం.

ఇదిలా ఉంటే.. ఈ రోజు విద్యాశాఖామంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న‌.. ముచ్చ‌ట‌గా మూడు ఫైల్స్ మీద సంత‌కాలు చేశారు. త‌న తొలి సంత‌కాన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్ని బ‌లోపేతం చేసేందుకు చేప‌ట్టాల్సిన సంస్క‌ర‌ణ‌ల‌పై క‌మిటీని నియ‌మించాల‌ని కోరారు.

రెండో సంత‌కం కింద ఉపాధ్యాయుల ప్ర‌మోష‌న్ల‌పై సంత‌కం చేసిన మంత్రి.. మూడో సంత‌కం ప‌దో త‌ర‌గ‌తిలో 20 శాతం ఇంట‌ర్న‌ల్ మార్కుల్ని ర‌ద్దు చేస్తూ సంత‌కం చేశారు. ప్ర‌భుత్వ ప్రాధామ్యాయాల‌లో కీల‌క‌మైన అమ్మ ఒడి ప‌థ‌కాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ ప‌థ‌కం అమ‌లులో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని.. త‌ర్వాతే ప్రైవేటు స్కూళ్ల‌లో అమ‌లు చేసే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌న్నారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

విశ్వ‌విద్యాల‌యాల్లో అక్ర‌మాల‌ను అరిక‌డ‌తామ‌ని.. వీసాలుగా వారి అనుభ‌వానికి పెద్ద పీట వేసి నియామ‌కం చేస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే విద్యా సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్ ను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌ల్ని ఏ మాత్రం మిస్ కాని రీతిలో మంత్రి సురేశ్ మాట‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.