Begin typing your search above and press return to search.

ఆది టీడీపీలో అనుచరులు వైసీపీలో

By:  Tupaki Desk   |   17 Jun 2016 11:53 AM GMT
ఆది టీడీపీలో అనుచరులు వైసీపీలో
X
వైసీపీ నుంచి కొద్ది నెలల కిందట టీడీపీలో చేరిన కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో ఇప్పటికే టీడీపీలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే... తాజాగా ఆది వర్గానికి చెందిన 100 కుటుంబాలు మళ్లీ వైసీపీలో చేరడం కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వీరంతా వైకాపాలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో జమ్మలమడుగు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సంగరయ్య వైకాపాలో చేరారు. తామంతా ఇకపై వైకాపా అధినేత జగన్ కు - అవినాష్ రెడ్డికి అండగా ఉంటామని పార్టీలో చేరిన కుటుంబాలు వెల్లడించాయి. ప్రజలకు ఏ మాత్రమూ ఉపయోగం లేని చంద్రబాబు పాలనతో వీరంతా అభివృద్ధికి దూరంగా ఉన్నారని, ఎన్ని పథకాలు ఉన్నా వీరి దరికి చేరలేదని ఈ సందర్భంగా అవినాష్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నా - ప్రజల అభిమానం చెక్కు చెదరలేదని అన్నారు.

కాగా ఆది అనుచరులు మళ్లీ వైసీపీలో చేరడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరినా పెద్దగా ప్రయోజనం లేకపోవడం.. మంత్రి పదవి వస్తుందని ఆశించినా రాకపోవడం వంటి కారణాలతో ఆది నిరాశగా ఉన్నారని... టీడీపీపై ఒత్తిడిపెంచే ప్రయత్నంలో భాగంగా ఆయన సూచనలతోనే ఇది పార్టీల మార్పిడి జరిగి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు టీడీపీలో రామసుబ్బారెడ్డి వర్గంతో వస్తున్న ఇబ్బందుల కారణంగా క్యాడర్ కొంత ఇబ్బంది పడుతోందని.. ఆ కారణంగానే వారంతా ఇమడలేక వెల్లిపోయారని తెలుస్తోంది.

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడానికి ముందునుంచే ఎన్నో సంఘర్షణలు జరిగాయి. ఆయన టీడీపీలోకి వస్తామని చెప్పడం.. దాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకించడం. చివరకు చంద్రబాబు ఒత్తిడితో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తదితరులు అంగీకరించడంతో ఆది టీడీపీలో చేరారు. అయితే ఆ తరువాత రామసుబ్బారెడ్డి - ఆదిలు పలుమార్లు వీధికెక్కారు. చంద్రబాబు వద్ద కూడా పంచాయతీలు జరిగాయి. దీంతో ఇద్దరు నేతల మధ్యా ఇప్పటికీ సయోధ్య లేదు. ఈ కారణంగానే ఆది అనుచరులు ఒక్కొరొక్కరుగా మళ్లీ వైసీపీలోకి వెళ్తున్నారని చెబుతున్నారు.