Begin typing your search above and press return to search.

‘ఆది’ వచ్చేయటానికి అంతా సెట్ చేసిన బాబు

By:  Tupaki Desk   |   15 Feb 2016 4:40 PM GMT
‘ఆది’ వచ్చేయటానికి అంతా సెట్ చేసిన బాబు
X
సొంతంగా చేతకాకున్నా.. కొన్ని విషయాలు చూసి నేర్చుకోవాలంటారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ఇంచుమించు ఇదే తీరులో ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ షురూ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాల్ని ఎంతగా వణికిస్తున్నారో ప్రత్యక్షంగా అనుభవిస్తున్న చంద్రబాబు.. ఏపీలో తాను కూడా ఇదే రీతిలో వ్యవహరించాలని భావిస్తున్నారు. విపక్ష నేత వైఎస్ జగన్ ను వణికించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన విపక్షానికి చెందిన నేతల్ని సైకిల్ ఎక్కించేందుకు రెడీ అవుతున్నారు.

గత కొద్ది నెలలుగా సాగుతున్న ఆదినారాయణ రెడ్డి ఎపిసోడ్ ని తాజాగా క్లోజ్ చేయాలని భావిస్తున్న బాబు.. ఆ చర్యతో జగన్ స్పీడ్ కు బ్రేకులు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. గత కొద్దికాలంగా జగన్ ను వదిలేసి.. సైకిల్ ఎక్కేయాలని తహతహలాడుతున్న ఆదినారాయణ రెడ్డి రాకకు.. ఆయనకు ప్రత్యర్థి అయిన తెలుగు తమ్ముడు కమ్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ససేమిరా అంటున్నారు. దీంతో ఆయన్ను సముదాయించి.. సర్దిచెప్పాలన్న ఆలోచనలో ఉన్న బాబు ఆదినారాయణ రెడ్డి రాకను ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్న పరిస్థితి.

అయితే.. తెలంగాణలో పార్టీ పుట్టెడు సమస్యలతో కిందామీదా పడుతున్న వేళ.. ఏపీలో పార్టీ మరింత బలీయం అవుతుందన్న సంకేతాలు ఇవ్వాలని బాబు భావిస్తున్నారు. దీనికి తోడు.. కొద్ది రోజులుగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలతో విపక్ష నేత జగన్ కాస్త స్పీడ్ పెంచారు. దాన్ని తగ్గించేందుకు వీలుగా జగన్ పార్టీకి చెందిన నేతల్ని సైకిల్ ఎక్కించాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జగన్ సొంత జిల్లా అయిన కడపకు చెందిన ఆదినారాయణ రెడ్డితో పాటు.. మరికొద్ది మంది ఎమ్మెల్యేల్ని సైకిల్ ఎక్కించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చర్యతో ఏపీలో తెలుగుదేశం పార్టీ మరింత పుంజుకోవటంతో పాటు.. జగన్ ను దెబ్బ తీసినట్లుగా భావిస్తున్నాయి.

అందుకే కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు వేగిరం చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఆది పొడ కూడా గిట్టని రామసుబ్బారెడ్డి.. ఆయన రాకకు ఓకే చెప్పారా? అన్నది డౌట్. అయితే.. రామసుబ్బారెడ్డిని బాబు ఒప్పించారన్న మాట బలంగా వినిపిస్తోంది. అయినా.. ఒక ఒరలో రెండు కత్తులు పట్టే ఛాన్స్ ఉందా అన్న సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆదిని పార్టీలోకి తెచ్చేందుకు బాబు కసరత్తు చేసి.. ఆయన రాకకు ఉన్న అడ్డంకుల్ని తొలగించినట్లుగా చెబుతున్నారు.