Begin typing your search above and press return to search.

చంద్రుళ్లను..జగన్ ను మొయింటైన్ చేస్తున్నమహేశ్

By:  Tupaki Desk   |   13 May 2016 5:00 PM GMT
చంద్రుళ్లను..జగన్ ను మొయింటైన్ చేస్తున్నమహేశ్
X
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనే ఇమడవు. మారిన కాల పరిస్థితులతో రెండు కత్తుల్ని ఒకే ఒరలో పెట్టేస్తున్న పరిస్థితి. కుదరదంటున్నా.. కుదుర్చుకోవాలంటున్న మాటలతో ముఖాలు మాడ్చుకొని మరీ చేతులు కలుపుతున్న చిత్రమైన రోజులివి. లేకపోతే.. కడపజిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి.. రామసుబ్బారెడ్డిలు కలవటం ఏంటి?.. ఈ ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటం ఏమిటి? అక్కడితో ఆగకుండా కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి.. శిల్పా బ్రదర్స్ చేతులు కలుపుకొని షేక్ హ్యండ్లు ఇచ్చుకోవటం ఏంటి? ఇలా చిత్రమైన కాంబినేషన్లను ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్న పరిస్థితి. అధినేత ప్రయోజనాల కోసం దశాబ్దాల తరబడి సాగిన పగల్ని.. ప్రతీకారాల్ని మర్చిపోయి చేతులు కలుపుకుంటున్నారు.

రాజకీయ అధినేతల వ్యూహాలు ఇంత కరుగ్గా ఉన్నప్పుడు.. తాను ఏ ఒకరిద్దరితో దగ్గరగా ఉండటం ఎందుకు అందరితోనూ రిలేషన్స్ ను మొయింటైన్ చేయాలన్నట్లుగా కనిపిస్తోంది టాలీవుడ్ అందగాడు.. ప్రిన్స్ మహేశ్ బాబు తీరు చూస్తుంటే. మొన్నటికి మొన్న తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెంకు వెళ్లిన ఆయన వెంట గుంటూరు ఎంపీ కమ్ బావ అయిన గల్లా జయదేవ్ ఉన్నారు. ఆయనతో పాటు పలువురు ఏపీ అధికారపక్ష నేతలు ఉండటం విశేషం.

నిజానికి మహేశ్ బుర్రిపాలెం పర్యటన మొత్తం ఏపీ అధికారపక్ష నేతగా స్వాగతం పలుకుతున్నట్లుగా సాగిందని చెప్పాలి. అడుగడుగునా పచ్చ జెండాలతో ఆహ్వానాలు.. స్వాగతాలు పలుకుతూ చేసిన ఏర్పాట్లు చూసినప్పుడు బావ కమ్ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తో అనుబంధం కారణంగా బాబు గూటికి మహేశ్ చేరేందుకు పావులు కదలటం మొదలయ్యాయా? అన్న డౌట్ పలువురికి వచ్చిన పరిస్థితి. గతంలో కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ తో క్లోజ్ గా మూవ్ అయిన కృష్ణ ఫ్యామిలీ బాబు అండ్ కో పంచనకు రానుందా? అన్న సందేహాలు తెర మీదకు వచ్చాయి.

అయితే.. ఇలాంటివన్నీ ఉత్త ఉహాగానాలు మాత్రమే తప్పించి అందులో ఎలాంటి నిజం లేదన్న విషయాన్ని మహేశ్ బాబు తాజాగా స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏపీ విపక్ష నేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయ్ సాయిరెడ్డికి దెబ్బలు తగిలిన నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సమయంలో ఆయన వెంట కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఉండటం గమనార్హం.

అంతేకాదు.. ఇటీవల జగన్ కు చెందిన సాక్షి మీడియా సంస్థకు చెందిన అవార్డు ఫంక్షన్ కు మహేశ్ హాజరు కావటం గమనార్హం. ఇదే కాదు.. తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంను ఉద్దరిస్తానంటున్న మహేశ్.. తెలంగాణలోనూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవటం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారాల్ని చూసినప్పుడు రెండు రాష్ట్రాల్లోని ముగ్గురు ముఖ్యనేతల్ని తెలివిగా మొయింటైన్ చేయటం కనిపిస్తుంది. విభజన నేపథ్యంలో ఎవరో ఒకరితో ఒకరితోనే సన్నిహిత సంబంధం కలిగి ఉండటం ఇబ్బందన్న విషయాన్ని గుర్తించిన మహేశ్ తెలివిగా వ్యవహరిస్తున్నారని.. ఇందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవటం నిదర్శనంగా చెప్పొచ్చు.

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాదిరి కాంగ్రెస్ వరకే పరిమితం కాకుండా.. అందరివాడు మహేశ్ అన్న భావన కలిగించటం విశేషంగా చెప్పాలి. చాలామంది నేతలు ఒక అధినేతతో క్లోజ్ గా మూవ్ అయితే.. మరొకరితో క్లోజ్ గా ఉండటానికి కాస్త సంకోచంతో వ్యవహరిస్తుంటారు. అందుకు భిన్నంగా మహేశ్ బాబు మాత్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఏపీ విపక్ష నేతతో చక్కటి రిలేషన్ మొయింటైన్ చేయటం గమనార్హం.