Begin typing your search above and press return to search.

తరలిపోయిన.. 'గోదారోళ్ల కితకితలు'

By:  Tupaki Desk   |   3 Jun 2022 9:33 AM GMT
తరలిపోయిన.. గోదారోళ్ల కితకితలు
X
‘‘ఆయ్ మేం గోదారోళ్లమండి’’.. ‘‘ఆయ్ మేం గోదారోళ్లమండి’’.. ‘‘మా మడుసులు మిన్నండి.. మా మనసులు యెన్నండి.. ఉప్పు కారం మాటేమో కానీ.. ఎటకారం మాత్రం ఎంతో రుచండి’’ అంటూ యాసతో ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్ ను వేదిక చేసుకున్న ఆ గుండె ఆగిపోయింది. గోదావరి జిల్లాల యాస, భాష, వంటలు, సంప్రదాయాలను ప్రపంచానికి మరింతగా చాటిచెప్పిన ఆ ప్రయత్నం నిలిచిపోయింది. మహిళలను అక్క, చెల్లి అంటూ.. పురుషులను బావ అంటూ ఫేస్ బుక్ గ్రూప్ సభ్యులను సంబోధించిన ఆ గొంతు మూగబోయింది.‘గోదారోళ్ల కితకితలు’పేరుతో ఫేస్‌బుక్‌ రూపొందించిన ఈదల వీర వెంకట సత్యనారాయణ (ఈవీవీ) ఆకస్మికంగా చనిపోయారు. తమ గ్రూప్ లోని సభ్యులను, వారిని అభిమానించే లక్షల మందిని హతాశులను చేశారు.

గుండెపోటు తో హఠాన్మరణం

గోదావరి యాస, భాషను మరింత సమున్నంతగా, సజీవంగా నిలిపేందుకు ఈదల వీర వెంకట సత్యనారాయణ చేసిన ప్రయత్నం అత్యంత విజయవంతమైంది. ఫేస్ బుక్ గ్రూప్‌ తో లక్షలాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఆయన గుండెపోటుతో మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లాలోని స్వస్థలం బొమ్మూరులో చనిపోయారు. గురువారం రాత్రి 11.30 సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఈవీవీ మృతిపట్ల ప్రముఖులు, గ్రూప్‌ సభ్యులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

2 లక్షల మంది ఫేస్ బుక్ గ్రూప్ సభ్యులు

గోదారోళ్ల కితకితలు ఫేస్ బుక్ గ్రూప్ ను ప్రారంభించిన ఈవీవీ సత్యనారాయణ ఆరోగ్యకర హాస్యాన్ని ప్రోత్సహించారు. ఈ గ్రూప్ లో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 2 లక్షలు కావడం విశేషం. ‘‘ఎక్కడైనా పట్టు చీరలు, నగలు చూస్తారు.. మేం ప్రేమాభిమానాలు చూస్తాం’’ అంటూ ఓ సందర్భంలో ఈవీవీ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 2 లక్షల మంది ఓ సామాజిక మాధ్యమం వేదికగా కుటుంబంగా ఏర్పడడం అంటే మాటలు కాదు. అది కేవలం ఈవీవీ సత్యనారాయణ వల్లనే సాధ్యమైంది.

ఆరేళ్ల కిందట గ్రూప్ ఏర్పాటు

ఈవీవీ సత్యనారాయణ ‘గోదారోళ్ల కితకితలు’పేరుతో 2016లో ఫేస్ బుక్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్‌ ఫాలోవర్లకు ఆయన ఆ విధంగానే సుపరిచితుడు. గోదారి యాస, భాష, సంస్కృతి తెలిపే పోస్టులు చేస్తుండటంతో ఆయన పేజీకి క్రమంగా ఆదరణ పెరిగింది. ఏడాదిలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ, విదేశాల నుంచి లక్ష మంది ఫాలోవర్లు వచ్చారు. దీంతో ఆయన కార్తీక మాసంలో బొమ్మూరులో వన భోజనాలు ఏర్పాటు చేసేవారు. దాదాపు 50వేల మంది వీటికి హాజరయ్యేవారు. గోదారోళ్ల యాస, భాష, సంస్కృతి భావి తరాలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ గ్రూప్‌ ను రూపొందించినట్లు పలు సందర్భాల్లో ఈవీవీ సత్యనారాయణ చెప్పేవారు.

బహుముఖ ప్రతిభ..

ఈవీవీ సత్యనారాయణ బహుముఖ ప్రతిభాశాలి. నటన, రచన, దర్శకత్వం ఇలా భిన్న రంగాల్లో తనదైన ముద్ర చాటారు. ఇక ఫేస్ బుక్ పేజీతోనే కాదు.. రచయితగా హాస్య, మధ్య తరగతి ప్రజల స్థితిగతులను తెలిపే కథనాలను పత్రికలకు రాశారు. గోదావరి యాసపై షార్ట్‌ ఫిల్మ్‌లు రూపొందించారు. నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన ‘బంగార్రాజు’ సినిమాలోనూ ఈవీవీ నటించారు.