Begin typing your search above and press return to search.

వ‌చ్చే జూన్ నుంచి విశాఖ నుంచే ప‌రిపాల‌న‌.. : ఏపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   16 Sep 2022 2:42 PM GMT
వ‌చ్చే జూన్ నుంచి విశాఖ నుంచే ప‌రిపాల‌న‌.. : ఏపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి, ఉత్త‌రాంధ్ర నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్‌.. గుడివాడ అమ‌ర్నాథ్‌.. మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖే ఏపీ ప‌రిపాల‌నా రాజ‌ధానిగా ఉంటుంద‌ని చెప్పారు. దీనిని ఎవ‌రూ ఆప‌లేర‌ని అన్నారు. అంతేకాదు.. టీడీపీ నాయ‌కులు.. అమ‌రావ‌తి రైతులు.. త‌ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా.. ఏ ఒక్క‌రూ.. విశాఖ‌ను రాజ‌ధాని కాకుండా.. ఆప‌డం సాధ్యం కాద‌ని.. చె్ప్పుకొచ్చారు. అయితే.. ఒక‌వైపు  అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు రెండో విడత మహా పాదయాత్ర చేపట్టిన విష‌యం తెలిసిందే.

అమ‌రావ‌తి టు అర‌స‌వ‌ల్లి పాద‌యాత్ర చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అంతో ఇంతో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల్సిన వైసీపీ మంత్రులు, నాయ‌కులు.. ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. పైగా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. విశాఖ నుంచి.. వచ్చే ఏడాది నుంచి పరిపాలన కొనసాగిస్తామని చెబుతున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి అమర్నాథ్  ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ``ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది. `బీచ్ ఐటీ కాన్సెప్ట్‌`తో విశాఖను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం`` అని మంత్రి తెలిపారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్మెంట్ మీట్ నిర్వహిస్తామన్నారు. విశాఖలో భూ అక్రమాల ఆరోపణలను టీడీపీ నేత‌లు.. మాజీ మంత్రులు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అమరావతిలో, విశాఖలో జరిగిన భూ క్రయవిక్రయాలు ఒక్కటేనా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖలో రాజధానికి ప్రైవేట్ భూమి సెంటు కూడా తీసుకోలేదని తెలిపారు. రైతుల పాదయాత్రలో విశాఖలో ఏం జరిగినా చంద్రబాబే బాధ్యత వహించాలని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌కు అడ్డంకులు సృష్టించే అవ‌కాశం ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా వారి మ‌నోభావాలు దెబ్బ‌తింటే.. తిర‌గ‌బ‌డ‌తార‌నే విష‌యాన్ని రైతులు గుర్తించాల‌ని.. మంత్రి హెచ్చ‌రించారు. విశాఖ రాజ‌ధాని అయితేనే ఉత్త‌రాంధ్ర‌కు నిధులు వ‌స్తాయ‌ని.. ఇక్క‌డి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయ‌ని అన్నారు. ద‌శాబ్దాలుగా ఇక్క‌డి యువ‌త పొరుగు ప్రాంతాల‌కు వెళ్లి కూలి ప‌నులు చేసుకునే దుస్థితి ఉంద‌ని.. దీనిని రూపు మాప‌డానికి.. సీఎం జ‌గ‌న్ కంక‌ణం క‌ట్టుకున్నార‌ని.. మంత్రి వ్యాఖ్యానించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.