Begin typing your search above and press return to search.

అద్దంకి వైసీపీలో యువ నేత‌కు సెగ‌.. తెర‌వెనుక కీల‌క నేత‌!!

By:  Tupaki Desk   |   10 Sep 2022 2:30 AM GMT
అద్దంకి వైసీపీలో యువ నేత‌కు సెగ‌.. తెర‌వెనుక కీల‌క నేత‌!!
X
ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య అసంతృప్తి సెగ‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ముఖ్యంగా అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్ బాచిన కృష్ణచైతన్యకు గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారాయి. అద్దంకిలో కృష్ణచైతన్యకి వ్యతిరేకంగా ఏర్పాటైన వర్గం పోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ.. కృష్ణచైతన్యపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. దీంతో.. అద్దంకి వైసీపీ వర్గపోరు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

కృష్ణచైతన్య తండ్రి బాచిన చెంచు గరటయ్య సీనియర్ నేత. గత ఎన్నికల సమయంలో తండ్రి వారసత్వంగా కృష్ణచైతన్య రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ త‌ర‌ఫున‌ పోటీ చేయాలని భావించినా.. వైసీపీ పెద్దలు ఆయన్ను పక్కన పెట్టి తండ్రికి టిక్కెట్ కేటాయించారు. అయితే గరటయ్య ఓటమి చెందడంతో ఆయన కుమారుడికి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గత రెండేళ్లుగా కృష్ణచైతన్య కనుసన్నల్లోనే అద్దంకి వైసీపీ రాజకీయాలు, అధికార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఈ మధ్యకాలంలో కృష్ణచైతన్యకు వైసీపీలో అసమ్మతి తీవ్రమైంది. అద్దంకిలో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ఝలక్‌ ఇస్తున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే కార్యకర్తల కోసం అంటూ అద్దంకి నియోజకవర్గ వైసీపీ పరిరక్షణ సమితి పేరుతో ప్రత్యేక కూటమిని తయారు చేశారు. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ వ్యతిరేక వర్గాన్ని కూడగడుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని.. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి కృష్ణ చైతన్య ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్య నేతలకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.

ఇక వ్యతిరేక వర్గమంతా కలిసి పోటీగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహించడం.. కృష్ణ చైతన్యకు మింగుడు పడడం లేదు. అసమ్మతి వర్గాన్ని పార్టీ ముఖ్య నేతలతో బుజ్జగించాలని ప్రయత్నించినా చర్చలు ఫలించలేద‌ని అంట‌న్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో అద్దంకి నుండి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న కృష్ణ చైతన్యకు తాజా పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

మొత్తంగా అద్దంకి వైసీపీలో నెలకొన్న అసమ్మతి సెగ వెనుక‌.. ఓ మాజీ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఉన్నార‌ని.. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నార‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని.. ఇక్క‌డ నుంచి పోటీ చేయించే ఉద్దేశంతోనే ఇలా యువ నేత‌కు సెగ పెడుతున్నార‌ని..కృష్ణ చైత‌న్య వ‌ర్గం అంటోంది. ఏదేమైనా.. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కోవ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.