Begin typing your search above and press return to search.

మ్యాటర్ అదేనట : ప్లీనరీలో ముందస్తు మీద ప్రకటన...?

By:  Tupaki Desk   |   8 July 2022 10:32 AM GMT
మ్యాటర్ అదేనట : ప్లీనరీలో ముందస్తు మీద ప్రకటన...?
X
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఈ మధ్య దాకా అంతా అనుకున్నారు. అది ఎంతదాకా వెళ్ళిందంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలను సైతం పక్కన పెట్టేసి ఈ అక్టోబర్ నుంచి అరు నెలల పాటు జనంలోనే ఉండబోతున్నారు. ఆయన బస్సు యాత్రను సైతం చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇక జనసేన నాయకులు అయితే వచ్చే ఏడాది ప్రధమ భాగంలో ఎన్నికలు వస్తాయని కూడా అంచనా వేస్తున్నారు.

ఇక తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు సంగతి వేరేగా చెప్పేదేముంది. ఆయన ఎన్నికలు తొందరలోనే వస్తాయని అంటూ చాలా కాలంగా చెబుతున్నారు. తన క్యాడర్ ని అలాగే రెడీ చేస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికల విషయంలో విపక్షాలు అలాంటి భావనకు రావడానికి కారణం వైసీపీ వ్యవహార శైలి కూడా అని చెప్పాలి. జగన్ ఈ మధ్య నుంచి జిల్లాల టూర్లు పెట్టుకుని ప్రతీ మీటింగులో విపక్షాలను చీల్చిచెండాడుతున్నారు. అలాగే గడప గడపకూ మన ప్రభుత్వం అని పార్టీ వారిని తిప్పుతున్నారు. మంత్రులతో బస్సు యాత్రను చేయించారు కూడా.

ఇలా వైసీపీలో స్పీడ్ చూసే విపక్షాలు తొందరపడుతున్నాయి. కానీ ఇపుడు చూస్తే వైసీపీకి అలాంటి ఆలోచనే లేదని తాపీగా నాయకులు చెబుతున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు అంటే కేంద్రం అనుమతి ఇవ్వాలి. దాని మీద ఆ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు జగన్ కేంద్ర పెద్దలతో సంప్రదించినా వారు వద్దు అనే చెప్పారని అంటున్నారు. ఒక రెండు తెలుగు రాష్ట్రాల విషయం చూసుకుంటే బీజేపీకి తెలంగాణా మీదనే గురి ఉంది.

అక్కడ 2023లో ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల అక్కడ ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో బీజేపీ పనిచేస్తోంది. ఒక వేళ గెలిచినా లేక ప్రధాన పక్షంగా ఆవిర్భవించినా కచ్చితంగా ఆ ప్రభావం సాటి తెలుగు రాష్ట్రం ఏపీ మీద కూడా పడుతుంది. అపుడు ఏపీలో రాజకీయ సమీకరణలను సెట్ చేసుకుని కాస్తా గట్టిగానే బరిలోకి దిగాలన్నది బీజేపీ ఆలోచన. దాంతో కేంద్రం నుంచి ఓకే కాలేదని ప్రచారం అయితే సాగింది.

మరో వైపు చూస్తే ఏపీలో విపక్షాలు ఏమీ నిర్లిప్తంగా లేవు. నాయకులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. అదే విధంగా చంద్రబాబు జిల్లాలను చుట్టేస్తూంటే పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర అంటున్నారు. దానికి తోడు ఏపీలో సంక్షేమ మాత్రమే ఎంతో కొంత జరుగుతోంది. అభివృద్ధి లేదు. ఈ విషయంలో ఏదీ చూపించకుండా ఎన్నికలకు వెళ్తే జనాలకు జవాబు చెప్పుకోవడం కష్టం అవుతుంది.

దాంతో రెండేళ్ళ కాలాన్ని పూర్తిగా వాడుకుని ఎంతో కొంత ప్రగతి సాధించామని చెప్పుకుని బరిలోకి దిగాలని వైసీపీ చూస్తోంది అంటున్నారు. ఇక కేంద్రం తో సఖ్యత వల్ల రానున్న కాలంలో ఆర్ధికంగా ఒడ్డెక్కగలమన్న భావన అయితే ఉంది. అలాగే కరోనా ప్రభావం తగ్గడంతో ఏపీలో ఆర్ధిక పరిస్థితులు కూడా మెరుగు అవుతున్నాయి. దాంతో పాలన తీరుని మెరుగుపరచుకుని ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

అలాగే పార్టీలో లోపాలను కూడా సరిచేసుకునేందుకు కావాల్సినంత టైమ్ ఉంటుందని కూడా భావిస్తున్నారుట. ఇదిలా ఉండగా ముందస్తు ఎన్నికల మీద వైసీపీ మంత్రి అంబటి రాంబాబు పూర్తిగా కొట్టిపారేశారు. అలాంటి ఊసే వైసీపీలో లేదని, తాము పూర్తి కాలం అధికారంలో కొనసాగుతామని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి తీరుతామని అంటున్నారు. ఇక ఎపుడు ఎన్నికలు పెట్టినా రెండేళ్ళ తరువాత పెట్టినా వైసీపీ మీద అభిమానం ఉంటే వేసే జనాలు ఓట్లు వేస్తారని, ఆ మాత్రం దానికి తొందరపడి బంపర్ మెజారిటీతో వచ్చిన సర్కార్ కధను మధ్యలో ముగించడం మంచిది కాదు అన్న ఆలోచనల వల్లనే ముందస్తుకు చెక్ పెట్టేశారు అని వినిపిస్తోంది.