Begin typing your search above and press return to search.

ఏపీకి అన్యాయంపై మోడీ బ్యాచ్‌ కు అద్వానీ చుర‌క

By:  Tupaki Desk   |   10 Feb 2018 4:59 AM GMT
ఏపీకి అన్యాయంపై మోడీ బ్యాచ్‌ కు అద్వానీ చుర‌క
X
కాలం క‌లిసి రాన‌ప్పుడు ఎంత పెద్దోడైనా కామ్ గా ఉండాల్సిందే. ఈ రోజున బీజేపీ ఇంత‌లా వెలిగిపోతుందంటే దానికి కార‌ణం వాజ్ పేయ్‌.. అద్వానీలే. మ‌రి.. ఈ ఇద్ద‌రిలో ఒక‌రు అనారోగ్యంతో బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితుల్లో ఉంటే.. మ‌రొక‌రు ఆరోగ్యంగా నేటికీ లోక్ స‌భ‌కు హాజ‌ర‌వుతున్న ప‌రిస్థితి. పేరుకు పెద్ద‌మ‌నిషిగా.. ఉత్స‌వ విగ్ర‌హంగా త‌న‌ను మార్చేసిన త‌న శిష్యుడి తీరుపై అద్వానీకి క‌డుపు ర‌గిలిపోతున్నా.. నోరు విప్ప‌కుండా ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అదే స‌మ‌యంలో త‌న దృష్టికి వ‌చ్చిన అంశాల‌పై స్పందించేందుకు ఏ మాత్రం వెనుకాడ‌టం లేదు. బ‌డ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయంతో పాటు.. విభ‌జ‌న హామీల్ని నెర‌వేర్చే విష‌యంలో మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ఏపీ ఎంపీలు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

గ‌డిచిన నాలుగు రోజులుగా లోక్ స‌భ కార్య‌క‌లాపాల్ని స్తంభింప‌చేసే ప్ర‌య‌త్నం చేసి.. పాక్షికంగా స‌క్సెస్ అయిన విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఇదిలా ఉంటే.. శుక్ర‌వారం లోక్ స‌భ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. తెలుగు ఎంపీలు స‌భా కార్య‌క్ర‌మాల్ని అడ్డుకుంటున్న నేప‌థ్యంలో స‌భ‌ను మార్చి 5కు వాయిదా వేస్తూ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ప్ర‌క‌టించారు. స‌భ‌లోని స‌భ్యులంతా వెళ్లిపోతున్నా.. బీజేపీ అగ్ర‌నేత అద్వానీ మాత్రం త‌న సీట్లోనే కూర్చున్నారు. ఆ విష‌యాన్ని గుర్తించి తెలుగు ఎంపీలు ప‌లువురు ఆయ‌న వ‌ద్ద‌కు చేరుకున్నారు.

ఏపీ విభ‌జ‌న చేసే స‌మ‌యంలో స‌భ‌లో మీరూ ఉన్నార‌న్న విష‌యాన్ని గుర్తు చేసిన తెలుగు ఎంపీలు.. ఏపీలో నెల‌కొన్న అంశాల్ని ఏక‌రువు పెట్టారు. రాజ‌ధాని లేదు.. ప‌రిశ్ర‌మ‌లు.. ఉద్యోగాలు లేవని చెబుతూ హోదా ఇస్తామ‌న్నార‌ని అది కూడా ఇవ్వ‌కుండా ప్యాకేజీకి ప‌రిమితం చేశార‌న్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేయ‌ట‌మే కాదు.. నేటికీ చేసిందేమీ లేద‌ని.. తాజా బ‌డ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగిన నేప‌థ్యంలో ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌న్నారు. ప్ర‌జ‌ల‌కు తాము జ‌వాబు చెప్పాల్సి ఉంటుంద‌ని.. చివ‌రి బ‌డ్జెట్ లో ఏపీకి ఏమీ ఇవ్వ‌క‌పోవ‌టం వ‌ల్లే పార్ల‌మెంటులో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేయాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. విభ‌జ‌న నాటి విష‌యాల్ని అద్వానీ ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తూ.. పార్టీల‌న్నీ క‌లిసి విభ‌జ‌న చ‌ట్టాన్ని ఆమోదించాయ‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రానికి న్యాయం చేయ‌లేద‌న్నారు.

తెలుగు ఎంపీల మాట‌ల‌కు స్పందించిన అద్వానీ.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాడ‌టంలో త‌ప్పు లేద‌ని చెబుతున్నారు. అన్యాయం జ‌రిగిన‌ప్పుడు గొంతెత్తే హ‌క్కు ఉంద‌ని.. స‌భాగౌర‌వం.. పార్ల‌మెంట‌రీ సంప్ర‌దాయాల్ని కూడా గ‌మ‌నించాల‌న్నారు. ఏపీ ఎంపీల ఆవేద‌న‌లో అర్థం ఉంద‌ని.. దాన్ని గుర్తించాల‌ని తాను జైట్లీతో చెబుతాన‌న్నారు. తాను ఇప్ప‌టికే జైట్లీతో మాట్లాడాన‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చాల‌ని కోరిన‌ట్లుగా చెప్పారు. త‌న మాట‌ల‌కు జైట్లీ సానుకూలంగా స్పందించి త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌ని చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు.

త‌మ హ‌క్కుల సాధ‌న కోస‌మే పోరాడుతున్నామే త‌ప్పించి.. పార్ల‌మెంట‌రీ సంప్ర‌దాయాలంటే త‌మ‌కూ గౌర‌వం ఉంద‌ని ఏపీ ఎంపీలు ఆద్వానీతో చెప్పారు. మీలాంటి పెద్ద‌లు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని.. తాము తొంద‌ర‌ప‌డితే మందలించాలంటూ ఏపీ ఎంపీలు చెప్పిన మాట‌ల‌కు రియాక్ట్ అయిన అద్వానీ.. ఎవ‌రిక‌ని చెప్ప‌ను అంటూ నిస్తేజంగా మాట్లాడ‌టం క‌నిపించింది. పార్టీలో తిరుగులేని స్థానం నుంచి.. ఇప్పుడు ఎవ‌రికి చెప్ప‌గ‌ల‌న‌న్న స్థాయికి వెళ్లిన అద్వానీ స్థితి చూస్తే జాలి క‌లుగ‌క మాన‌దు.