Begin typing your search above and press return to search.
ఆ పెద్దాయనకు కూడా రాష్ట్రపతి పదవి వద్దట
By: Tupaki Desk | 7 April 2017 6:10 PM GMTదేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి పదవిపై జోరుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ జూలై 24తో ముగుస్తున్న నేపథ్యంలో ప్రణబ్‌ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి పదవి ఎవరిని వరించనున్నదనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో సహజంగా అందరి చూపు అధికార ఎన్డీఏపై పడింది. గత కొంతకాలంగా ఈ పదవికి సంబంధించి బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ పేరుతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.
కాగా, ఈ విషయంలో అద్వానీ అనూహ్యమైన క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ వెలుపల విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రపతి పదవి రేసులో తాను లేనని అద్వానీ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటారని అద్వానీ చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల గుజరాత్‌లో పర్యటించినప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు అద్వానీ గురువు అని, ఆయనకు సముచిత స్థానం కల్పించి గురుదక్షిణ తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మోడీ అన్నారు. దీంతో రాష్ట్రపతిగా అద్వానీని చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే తాజాగా అద్వానీ తాను ప్రెసిడెంట్ రేస్ లో లేనంటూ ఆ వదంతులకు బ్రేక్ వేశారు.
ఇదే రీతిలో కొద్దికాలం క్రితం రాష్ట్రపతి పదవిపై రేసు విషయంలో సంఘ్ రథసారథి మోహన్ భగవత్ సైతం ప్రచారాన్ని కొట్టిపారేశారు. అంతే కాదు తాను రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నట్లుగా వచ్చే వార్తలన్నీ వినోదం కోసం సృష్టించినవే అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇలా సీనియర్లంతా తమ పేరును తోసిపుచ్చుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి అభ‍్యర్థి ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ రథసారథి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయంపై రాజకీయవర్గాల్లో ఒకింత ఉత్కంఠ సాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/