Begin typing your search above and press return to search.

ఢిల్లీ నుంచి లండన్ కి బస్సు.. మీరు విన్నది నిజమే!

By:  Tupaki Desk   |   23 Aug 2020 11:10 AM GMT
ఢిల్లీ నుంచి లండన్ కి బస్సు.. మీరు విన్నది నిజమే!
X
ఢిల్లీ నుంచి లండన్ కి బస్సు సౌకర్యం ప్రారంభం కానుంది. ఢిల్లీ ఎక్కడ... లండన్ ఎక్కడ..అక్కడికి బస్సు సౌకర్యం ఏంటి.. అని అనుకుంటున్నారా..నిజంగానే ఢిల్లీ నుంచి లండన్ కి బస్సు వేశారు. అయితే ఇది సాదా సీదా యాత్ర కాదు. సాహస యాత్ర. గురుగ్రామ్ కేంద్రంగా నడుస్తున్న 'అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ ' అనే ప్రైవేట్ టూరిస్ట్ కంపెనీ ఈ సాహస యాత్ర మొదలు పెట్టింది. ప్రయాణికులకు వీసా కూడా ఆ కంపెనీనే ఇప్పిస్తుంది. నిజంగా ఈ కంపెనీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఎక్కడి ఢిల్లీ.. ఎక్కడి లండన్.. అంటూ ఆశ్చర్య పోతున్నారు. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లడం అంటే మధ్యలో ఎన్నో దేశాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది.

అత్యంత ఖరీదైన యాత్ర కూడా. మే 21న ఈ సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ సాహస యాత్రకు 'బస్ టు లండన్' అని పేరు పెట్టారు. 18 దేశాల గుండా ఈ ప్రయాణం సాగుతుంది. మయన్మార్, లావోస్, థాయిలాండ్, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బేకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లికన్, జర్మనీ, బెల్జియం, యునైటెడ్ కింగ్ డన్ దేశాల గుండా సాహస యాత్ర సాగనుంది. ఈ సుదీర్ఘ బస్సు యాత్ర కోసం 20 బిజినెస్ క్లాస్ సీట్లతో ఒక ప్రత్యేక బస్సును డిజైన్ చేశారు. 20 మంది ప్రయాణికులకు గాను ఒక డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గైడ్, ఓ సహాయకుడు ఉంటారు. ఈ యాత్రను నాలుగు కేటగిరిలుగా విభజించారు. మార్గమధ్యంలో ని ఏ దేశంలో అయినా దిగొచ్చు. అయితే ప్యాకేజీలు మాత్రం మారుతుంటాయి. ఢిల్లీ నుంచి లండన్ వరకు తమ యాత్రని సాగిస్తే టికెట్ గా రూ. 15 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. బస్సు యాత్రల్లో అత్యంత ఖరీదైన ఈ సాహస యాత్రను చెప్పొచ్చు.